ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్కారు మరో గుడ్ న్యూస్..
తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు ఆర్థిక భరోసాగా నిలుస్తోంది. సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్న సుమారు 23 వేల మంది లబ్ధిదారులకు రూ.262.51 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు. ఈ మొత్తాన్ని ఆధార్ నంబర్ ఆధారంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ వారం విడుదల చేసిన నిధుల్లో, బేస్‌మెంట్ స్థాయి నిర్మాణ పనులు పూర్తిచేసిన 2,763 మంది లబ్ధిదారులు, అలాగే గోడలు, శ్లాబ్ స్థాయి దాటిన 20,186 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. నిర్మాణ దశను బట్టి దశలవారీగా చెల్లింపులు చేస్తున్నామని, పనుల పురోగతికి అనుగుణంగా బిల్లులు విడుదలవుతున్నాయని తెలిపారు.

ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ.4,351 కోట్లకు పైగా నిధులను లబ్ధిదారులకు విడుదల చేసినట్లు ఎండీ గౌతం పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.
మార్చి నాటికి లక్ష ఇండ్లు..
ఈ పథకం కింద ఈ ఏడాది మార్చి నాటికి లక్ష ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఎండీ తెలిపారు. అలాగే, ఈ దశ పూర్తయిన వెంటనే తదుపరి దశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే సన్నద్ధమవుతోందని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లు నిర్మించుకుంటున్న ప్రతి లబ్ధిదారునికీ బిల్లులు సకాలంలో విడుదల అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మొత్తం ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, ఆన్‌లైన్ విధానంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీల అనంతరమే అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని గౌతం తెలిపారు. వీటిలో దాదాపు 1.25 లక్షల ఇండ్లు గోడలు, శ్లాబ్ స్థాయికి చేరువలో ఉండగా, మరో 75 వేల ఇండ్ల పనులు ఇప్పటికే బేస్‌మెంట్ దశను దాటిపోయాయని వెల్లడించారు.
ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యత, వేగం రెండింటినీ నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్లు తరచూ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారని, అలాగే నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని ఎండీ తెలిపారు. పేదల సొంతింటి కలను త్వరితగతిన నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications