పేగుపాశం మరచి పారేసిన తల్లిదండ్రులు.. పసికందు కోసం పరుగులు పెట్టిన పోలీసులు
సమాజంలో రోజు రోజుకి మానవతా విలువలు నశించిపోతున్నాయి. రక్త సంబంధానికి, పేగు బంధానికి అర్థం లేకుండా పోతుంది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పలలో, నడిరోడ్డు పైన పడేసి వెళుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సైతం సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి అమానుష ఘటన హైదరాబాద్ కుషాయిగూడ లో చోటుచేసుకుంది.
అప్పుడే భూమ్మీద పుట్టిన పసికందును ఓ అపార్ట్మెంట్లో భవనంపై నుండి ఆవరణలో పడేసి వెళ్లిపోయారు ఆమెను కన్న తల్లిదండ్రులు. లోకం పోకడ తెలియని ఆ పసికందుపై అమానవీయంగా ప్రవర్తించారు. కుషాయిగూడ ఏరియా కమల నగర్ లో జరిగిన ఈ ఘటన అపార్ట్మెంట్ వాసులను ఒక్కసారిగా ఆవేదనకు గురి చేసింది. పైనుండి క్రింద పడిన శిశువు తలకు సిమెంట్ కాంక్రీట్ గుచ్చుకోవటంతో బలంగా దెబ్బ తగిలింది. దీంతో పసికందు గుక్కపెట్టి ఏడ్చింది. అది చూసిన అపార్ట్ మెంట్ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాణాలతో ఉన్న పసికందును కాపాడే ప్రయత్నం చేశారు.

తలకి బలమైన గాయం తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసికందును చూసి చలించిపోయిన కుషాయిగూడ ఎస్ ఐ సాయి కుమార్ వెంటనే చిన్నారి ని చేతుల్లోకి తీసుకుని వైద్యం కోసం ఆసుపత్రికి పరుగులు పెట్టారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసిపాపకు ప్రధమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పాపను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లలు లేక ఎంతోమంది తల్లిదండ్రులు కంటికి కడివెడు రోదిస్తున్న పరిస్థితి ఉంది. తమకు ఒక బిడ్డ పుడితే చాలు అని తపస్సు చేస్తున్న దంపతులు ఎంతో మంది జంటలు ఉన్న నేటి రోజుల్లో, పుట్టిన బిడ్డలు వద్దని పారేసి వెళుతున్న ఘటనలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగిస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే ఈ విధమైన ఘటనలకు పాల్పడుతుండటంతో ఈ ఘటనలు రక్త సంబంధాలను సైతం ప్రశ్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications