అక్రమ సంబంధం, మద్యానికి బానిస: తల్లే చిన్నారిని చంపిందా?
హైదరాబాద్: హైదరాబాదులోని సింగరేణి కాలనీ వాంబే గృహాలలో ఒక చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మద్యానికి బానిసైన కన్నతల్లే చిన్నారిని చంపి వుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సందగట్ల తండాకు చెందిన రమేష్, విజయ దంపతులు సింగరేణి కాలనీ వాంబే గృహాల్లో వుంటున్నారు. వారికి గాయత్రి (7) అనే కూతురు ఉంది. ఆటోడ్రైవర్‌గా పనిచేసే రమేష్‌కు భార్యకు కొద్దిరోజుల క్రితం విభేదాలు రావడంతో పెద్దమనుషులు రాజీకి ప్రయత్నించినా విడివిడిగానే వుంటున్నారు.
కూతురు గాయత్రి విజయతోనే వుంటుంది. అయితే ఆదివారం సాయంత్రం ఆమె ఇరుగుపొరుగుతో గాయత్రి పాలు తాగి పడుకుని తిరిగి లేవడంలేదని చెప్పింది. దాంతో వారు వెళ్లి చూడగా గాయత్రి మృతిచెంది వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే భర్తతో విడిగా వున్నప్పటి నుంచి విజయ మద్యానికి బానిసైందని, మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంటికి వచ్చే అపరిచిత వ్యక్తి గురించి పాప తల్లిని ప్రశ్నించేదని తెలుస్తోంది.
అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న తల్లే కర్కశంగా పాప మెడకు ఉరివేసి చంపిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక పాప మృతిపై అనుమానాలు తొలగుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications