ఆటలొద్దు, అప్పుడు తన్నులు తిన్నారు: బాబుపై పరోక్షంగా కవిత
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన ఎక్కడైనా, ఎప్పుడైనా తాము చర్చకు సిద్ధమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు టిడిపి, కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. చర్చకు ముఖ్యమంత్రిగానీ తాము గానీ వచ్చేందుకు సిద్ధమని చెప్పారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు భీమా సొమ్మును చెల్లించే కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది బీమా సొమ్మును నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.
శాసనసభ వేదికగా చర్చిద్దామని సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే టిడిపి, కాంగ్రెస్ పార్టీల ప్రజాప్రతినిధులు పారిపోయారన్నారు. పరీక్షలు ఎగ్గొట్టే విద్యార్థి కడుపు నొప్పి, కాలు నొప్పి అని కుంటి సాకులు చెప్పినట్టు, ఈ రెండు పార్టీల నాయకులు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు.

కవిత
సీఎం కేసీఆర్ ప్రజలు, ప్రాజెక్టుల్ని ప్రాణప్రదంగా చూసుకుంటారని, ఆయన పని తీరు, వేగాన్ని తట్టుకోలేక తమ పార్టీలు కనుమరుగవుతాయనే భయంతో కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారని, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పునర్నిర్మించుకోవాల్సిన అక్కర ఉందని కేసీఆర్ చెప్పారని, అన్ని రంగాల్లో మన ప్రాధాన్యాలను పునఃసమీక్షించుకుని, రీడిజైనింగ్ చేసుకోవాలని కవిత అన్నారు.

కవిత
తెలంగాణకు సరిపోయే విధంగా ఈ ప్రక్రియ సాగాలని కవిత అన్నారు. అందులో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, అందరూ మాట్లాడొచ్చని, అనుమానాలు నివృత్తి చేసుకోవడంతో పాటు సూచనలు చేయవచ్చని కెసిఆర్ చెప్పినా, కాంగ్రెస్, టిడిపి నాయకులు సభ నుంచి పారిపోయారు ఎద్దేవా చేశారు.

కవిత
కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత-చేవెళ్లకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. రూ.38,500 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో, మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ఎవరికెంత ఇచ్చి, ఎన్ని మీటర్ల కాల్వలు తవ్వారో ప్రజలకు స్పష్టంగా చెప్పి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి టీడీపీలో ఉండి తమ పార్టీ నేతలే ఆర్డీఎస్ తూములను బాంబులు పెట్టి పేల్చివేస్తే ఏం చేశారని నిలదీశారు.

కవిత
మహిళా నేత అయిన డీకే అరుణ ఒకసారి, తాను మరోసారి అక్కడికి వెళ్లి చూసినపుడు ఈ నాయకులు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలన్నారు. వెయ్యి కోట్లిస్తే మహబూబ్‌నగర్ ప్రాజెక్టులు పూర్తవుతాయంటున్న టీడీపీ నాయకులు, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించనపుడు పదవులు అనుభవిస్తూ కూర్చున్నారు తప్ప అడగలేదన్నారు.

కవిత
ప్రాణహిత-చేవెళ్లకు ఖర్చు ఎందుకు పెరిగిందని కొందరు నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. ప్రయోజనాలు పెరిగినపుడు ఖర్చు కూడా పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ డిజైన్ ప్రకారం వరద వచ్చినపుడు మోటార్లు నడిపి వెంటవెంట పొలాలకు నీళ్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ కేసీఆర్ డిజైన్‌లో వరద వచ్చినపుడు నీటిని లిఫ్టు చేసి.. వాటిని రిజర్వాయర్లలో నింపుకుంటామని, అవసరం వచ్చినపుడు వాడుకుంటామన్నారు.

కవిత
బడి ఎగ్గొట్టినట్లు సభ నుంచి పారిపోయిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రజెంటేషన్‌ను మరోసారి చూడాలని కవిత సూచించారు. టీచర్ పాఠం సరిగా విననివాళ్లు పరీక్షల్లో ఫెయిల్ అవుతారని, ఇప్పటికే ఒకసారి ఫెయిల్ అయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్టులతో ఆటలాడొద్దని రెండు పార్టీల నేతల్ని కోరారు. బాబ్లీ ప్రాజెక్టు అంశం మీద మహారాష్ట్రకు పోయి తన్నులు తిని, తెలంగాణ ఆత్మగౌరవానికి విఘాతం కలిగించింది టీడీపీ పార్టీయే తప్ప సీఎం కేసీఆర్ ఏనాడూ, ఎవరి ముందు శిరసు వంచలేదన్నారు. కాగా, నాడు బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు పోరు చేసి జైలులో గడిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications