తెరాసలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కుదుపు: మైండ్ గేమ్ వద్దని ఎంపీల తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్: నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలోపు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది అధికార పార్టీలో ఓ కుదుపుకు కారణమైనట్లుగా కనిపిస్తోంది. ఈ ప్రచారంపై వెంటనే ఇద్దరు ఎంపీలు బయటకు వచ్చి ఖండించారు.

రేవంత్ చెప్పేది అబద్దం
తాను తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయని, ఇవన్నీ అవాస్తవమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తనకు అలాంటి ఆలోచన ఏమాత్రం లేదని చెప్పారు. తనపై రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఆయన గురువారం ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మైండ్ గేమ్ ఆడుతున్నారు
మరో టీఆర్ఎస్ ఎంపీ (మహబూబాబాద్) సీతారామ్ నాయక్ కూడా రేవంత్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. రేవంత్ చిల్లర వేషాలు వేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని స్పష్టం చేసారు.

రేవంత్‌కు దమ్ముంటే
ఇద్దరు తెరాస ఎంపీలు పార్టీ మారతారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని సీతారాం నాయక్ కొట్టి పారేశారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌లోకి వెళ్లే ఎంపీల పేర్లను వెల్లడించాలని సవాల్ చేశారు. భవిష్యత్తులో ఇలా మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించారు. తెరాస కోసం పనిచేసే వారిని ఆత్మరక్షణలో పడేసేలా మైండ్ గేమ్స్ వద్దని చెప్పారు. తాను తెరాసలోనే ఉంటానని చెప్పారు.

నాకు బాధగా ఉంది
అలాంటి వార్తలు వచ్చినందుకు చాలా బాధగా ఉందని సీతారామ్ నాయక్ చెప్పారు. కేయూలో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని గుర్తు చేశారు. విద్యార్థులకు అండగా నిలిచానని చెప్పారు. రాష్ట్రంలో 26 లక్షల మంది లంబాడీలు ఉన్నారని, లంబాడీలు ఎక్కడ ఉన్నారో అక్కడ తాను ప్రచారం చేస్తున్నానని చెప్పారు. ఆ ప్రచారంలో భాగంగానే తాను కొడంగల్ వెళ్లానని, అంతేగానీ రేవంత్ చెప్పిన దాంట్లో నిజం లేదన్నారు.












Click it and Unblock the Notifications