మహిళలకు రూ.2,500, పింఛన్ల పెంపు అప్పటినుండే.. శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. తమ పార్టీల కోసం ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఆరు హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేదని బిజెపి, బిఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి.
రేవంత్ రెడ్డి హామీలపై ప్రతిపక్షాలు టార్గెట్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని, రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్యూర్ పాలన అని పదేపదే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా పింఛన్ల పెంపు నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2500 రూపాయలను ఇస్తామన్న హామీని ప్రశ్నిస్తున్నాయి.

ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న వారు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలను గురించి చెబుతూనే, పెండింగ్ పథకాలను త్వరితగతిన అందిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సంపత్ కుమార్ చెప్పిందిదే
పింఛన్ల పెంపు, మహిళలకు 2500 పథకాల పైన గద్వాల జిల్లా ఐజలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మార్చి తర్వాత పింఛన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని, మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 2500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి చక్కదిద్దుతున్నారని పేర్కొన్నారు.
మహిళలకు ఆర్ధిక సాయం, పెన్షన్ ల పెంపుపై తీపికబురు
ఇప్పటికే ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలను అమలు చేశామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇక తాజాగా మార్చి తర్వాత పింఛన్ల పెంపు జరుగుతుందని, మహిళలకు 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని ఆయన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి తర్వాత వీటిని అమలు చేస్తుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications