గట్టిపోటీ ఇచ్చినా బీజేపీకి ఆటుపోట్లు.. ఫలితాలకు ముందు బీజేపీ అభ్యర్థి మృతి
తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన హోరాహోరీ ఎన్నికలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం కి మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి రిజల్ట్స్, సాయంత్రానికి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ లో కొన్ని చోట్ల మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోరు కొనసాగిస్తుంటే, కొన్నిచోట్ల కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కి మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతుంది.
ఎన్నికల ఫలితాలలో వెనుకబడిన బీజేపీ
ఎన్నికలలో అత్యధిక ఫలితాలు సాధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా తమ పార్టీని చూపించాలని భావించిన బీజేపీ నాయకులు ఎన్నికల ఫలితాలలో వెనుకబడి ఉన్నారు. బరిలోకి దిగిన అభ్యర్థులందరూ హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ కేంద్ర మంత్రులు ఫోకస్ పెట్టి మరీ రంగంలోకి దిగినప్పటికీ బిజెపికి ఆశించిన మేర ఫలితాలు కనిపించడం లేదు.

బీజేపీకి ఊహించని షాక్
అయినప్పటికీ అనేక స్థానాల్లో బిజెపి అభ్యర్థులు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఎన్నికలలో బిజెపికి ఓటుశాతం పెరిగింది అన్న అభిప్రాయం బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది అన్న భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న కౌంటింగ్ లో అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎన్నికలలో పోటీ చేసిన ఓ అభ్యర్థి మృతిచెందడం బిజెపికి షాక్ ఇచ్చింది.
ఎన్నికల కౌంటింగ్ కు ముందు బీజేపీ అభ్యర్థి మృతి
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పదవ వార్డుకు చెందిన బిజెపి అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ మృతి చెందారు. ఈరోజు ఉదయం అనారోగ్యంతో ఆమె తుదిశ్వాస విడిచారు. అయినప్పటికీ ఆ స్థానానికి కౌంటింగ్ నిర్వహిస్తున్న అధికారులు, ఒకవేళ మృతిచెందిన అభ్యర్థి విజయం సాధిస్తే, అభ్యర్థి మరణించారు కాబట్టి ఆస్థానానికి మళ్ళీ ఉపఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థి విజయం సాధించకపోతే ఎటువంటి సమస్య లేనట్టే.
మొన్న అభ్యర్థి సూసైడ్.. ఇప్పుడు అభ్యర్థి మృతి
అయితే బిజెపికి ఎన్నికలకు ముందు మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం, ఇప్పుడు మరొక బీజేపీ అభ్యర్థి చనిపోవడం షాక్ అనే చెప్పాలి. తెలంగాణా ఎన్నికల పోరులో బీజేపీకి ఈ తాజా ఘటనలు కూడా కాస్త వెనుకబడేలా చేశాయి.












Click it and Unblock the Notifications