మునుగోడు యువతకు గోవా ట్రిప్ లు; డిజిటల్ చెల్లింపులు, ప్రలోభాలపర్వంలో పార్టీల ట్రాప్‌లో ఓటర్లు!!
మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు గతంలో జరిగిన అన్ని ఎన్నికలకు భిన్నంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా తీసుకోవడంతో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదల ప్రధాన పార్టీలలో కనిపిస్తుంది. ఇందు కోసం అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మునుగోడులో ఓటర్లను కొనుగోలు చేయడం కోసం ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా రాజకీయాలు చేస్తున్నాయి.

మునుగోడులో మందు, విందు, నగదు రాజకీయం
తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నికలలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి మునుగోడు ఉప ఎన్నికలలో చిత్రవిచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకోవడానికి కోసం ఇప్పటికే మందు, విందు రాజకీయాలకు తెర తీయగా, కొన్ని మండలాల్లో ఇప్పటికే ఇంటింటికీ కిలో ఫ్రీ చికెన్ పంపించి ఓటర్ల మనసు గెలుచుకునేందుకు యత్నం చేశారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలన్నీ బూత్ వారీగా ఇంచార్జ్ లను నియమించారు. వారు తమకు కేటాయించిన ఓట్లను కలుస్తూ వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

డబ్బులు గూగుల్ పే చెయ్యాలా? ఫోన్ పే చెయ్యాలా? ఓటర్ల కొనుగోలు యత్నం
ప్రత్యర్థి పార్టీల నాయకులు ఏమిస్తున్నారు? తాము ఏమిస్తే ఓటర్లు తమ వైపుకు మొగ్గుతారు వంటి అనేక అంశాలపై దృష్టి సారించి ఓటర్లను ప్రలోభపెట్టే కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక డబ్బులతో ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తున్న వారు గూగుల్ పే చేయమంటారా? ఫోన్ పే చేయమంటారా అంటూ డిజిటల్ లావాదేవీల వైపు ఓటర్ల దృష్టిని మళ్లిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే లేకపోతే నగదు రూపంలో కూడా డబ్బులు ఇవ్వడానికి పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ఉన్నవారికి డిజిటల్ చెల్లింపులు చేయడానికి వారి ఫోన్ నెంబర్లను నమోదు చేసుకుంటున్నారు.

యువత కోసం గోవా ట్రిప్ లు ప్లాన్.. విమానంలోదర్జాగా .. ఖర్చంతా పార్టీదే
ఇక ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను రప్పించటానికి వాహనాలను ఏర్పాటు చేయడం, వారికి కావలసిన టిక్కెట్లను వీరే కొనుగోలు చేసి పంపించడం వంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గం లో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఓ ప్రధాన పార్టీ కొత్త పుంతలు తొక్కుతున్న ట్లు తెలుస్తోంది. యువతను ఆకర్షించడం కోసం చౌటుప్పల్ మండలం లో గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పది మంది యువకులు కలిసి పార్టీలో చేరి, మునుగోడు ఉప ఎన్నికలలో పార్టీ కోసం పని చేస్తే వారికి ఒక్కొక్కరికి పదివేల నగదు ఇచ్చి, విమానంలో గోవా వెళ్లి వచ్చేలా టిక్కెట్లు ఇప్పించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికి చౌటుప్పల్ మండలం లో రెండు యువ గ్రూపులు త్వరలో గోవా వెళ్లడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికతో పండుగ వాతావరణం
ఏదేమైనా మునుగోడులో ఉప ఎన్నిక ఒక పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. మునుగోడు ఓటర్లకు డబ్బులు, మందు, విందు పార్టీలు, యువతకు గోవా ట్రిప్ లు, ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను మునుగోడు కు తీసుకు రావటానికి చేస్తున్న ప్రయత్నాలు వెరసి మునుగోడులో ప్రలోభాల పర్వం పీక్స్ కు చేరుకున్నది అన్న విషయం ప్రధానంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications