మూసారాంబాగ్-అంబర్‌పేట రూట్ లో కొత్త వంతెన.. ప్రారంభం ఎప్పుడంటే
మూసీ పరీవాహక ప్రాంతాల వారికి, హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. హైదరాబాద్ లోని మూసారాంబాగ్ నుంచి అంబర్‌పేట మార్గంలో మూసీ నదిపై నిర్మిస్తున్న నూతన వంతెన పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ వంతెన త్వరలోనే ప్రారంభానికి నోచుకోనుంది. హైదరాబాద్ లోని మూసారాంబాగ్ నుంచి అంబర్‌పేట మార్గంలో సుమారు రూ.52 కోట్ల వ్యయంతో, 220 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు.
శిథిలావస్థకు మూసారాంబాగ్ - అంబర్‌పేట పాత వంతెన
ఈ నెలాఖరున ప్రారంభోత్సవం నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాత వంతెన శిథిలావస్థకు చేరి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తినప్పుడు వచ్చే వరద నీరు పాత వంతెనపైనుంచి ప్రవహించేది. దీనితో అక్కడ ట్రాఫిక్‌ను తీవ్రంగా ప్రభావితం చేసేది. ప్రజలు తమ పనులను చేసుకోవటానికి వెళ్లేందుకు నానా అగచాట్లు పడాల్సి వచ్చేది.

మూసీ నది ఒడ్డున ఉన్న ఇతర ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ
కొత్త వంతెనను ఎత్తు పెంచి నిర్మించడం వల్ల ఇక ఆ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ ప్రాంతాల ప్రజలకు వర్షాకాలంలో కూడా సురక్షితంగా ప్రయాణాలు సాగే అవకాశం ఏర్పడుతుంది. ఈ వంతెన పూర్తయితే మూసారాంబాగ్, అంబర్‌పేట ప్రాంతాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయి. అంతేకాదు నగరంలో మూసీ నది ఒడ్డున ఉన్న ఇతర ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ మెరుగుపడుతుంది.
ఆధునిక వంతెనల నిర్మాణం వల్ల నగర ప్రజలకు ఉపశమనం
పాత వంతెనపై ఆధారపడి ఉన్న వాహనదారులు, పాదచారులు ఇక నుంచి సమస్యలు ఎదుర్కోకుండా సాఫీగా ప్రయాణించగలుగుతారు. నిర్మాణం సమయంలో తీసుకున్న జాగ్రత్తలు, నాణ్యత ప్రమాణాలు కొత్త వంతెనను మరింత బలంగా, సురక్షితంగా తీర్చిదిద్దాయి. హైదరాబాద్‌లో మూసీనది వరదల సమస్య ఎప్పటినుంచో ఉంది. ఇలాంటి ఆధునిక వంతెనల నిర్మాణం వల్ల నగర ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.
త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ఖరారు
ప్రారంభం అయిన తర్వాత ట్రాఫిక్ సాఫీగా నడుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ కొత్త వంతెన ప్రారంభం అయితే వరదలు, భారీ వర్షాల సమయంలో ఈ ప్రాంత ప్రజల సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది.













Click it and Unblock the Notifications