టీఆర్ఎస్‌కు తీన్మార్ మల్లన్న గండం?: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీకి సై?
నల్లగొండ: నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఫలితాలు.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కోల్పోవడం, ఆ వెంటనే నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బొటాబొటితో మెజారిటీ డివిజన్లను సాధించడం వంటి పరిణామాల మధ్య వెలువడిన శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గ ఫలితాలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వెలువడటం నూతనోత్తేజాన్ని నింపినట్టయింది.

నోముల కుటుంబానికి..
ఇక ఇదే ఊపుతో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సమాయాత్తమౌతోంది గులాబీ పార్టీ. దుబ్బాక స్థానాన్ని కోల్పోయిన నేపథ్యంలో- ఈ సీటును నిలబెట్టుకోవడంపై దృష్టి సారించింది. దుబ్బాకలో ఎదురైన చేదు ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడుతోంది. అభ్యర్థిని ఎంపిక చేయడంపై కసరత్తు చేస్తోంది. కన్నుమూసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబానికే టికెట్ ఇవ్వాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ను నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో దింపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నల్లగొండపై తీన్మార్ పట్టు..
వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా ఓట్ల లెక్కింపు ఆరంభమైన తరువాత.. తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీని సాధిస్తూ వచ్చిన విషయం తెలిసిిందే. రౌండ్ రౌండ్‌కూ ఆయన అనూహ్యంగా ఓట్లను సాధించారు. అప్పటిదాకా తొలి మూడు స్థానాల్లో లేకుండా పోయారు. నల్లగొండ ఓట్ల లెక్కింపు ఆరంభమైన తరువాత దూసుకొచ్చారు.

తేడా మూడుశాతమే..
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి తీన్మార్ మల్లన్నరెండో స్థానంలో నిలిచారు. మొత్తంగా- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి -1,61,811, తీన్మార్ మల్లన్న-1,49,005 ఓట్లు పోల్ అయ్యాయి. 12,806 ఓట్ల తేడాతో మల్లన్న ఓడిపోయారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం శాతం మూడు మాత్రమే. నల్లగొండ రాజకీయాలపై ఆయనకు గట్టి పట్టు ఉందనే విషయం ఈ ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. దీనితో- నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో దిగాలని తీన్మార్ మల్లన్న భావిస్తున్నారని, నేడో, రేపో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది.

గెలుపు కోసం వంద కోట్లు ఖర్చు..
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు సైతం తీన్మార్ మల్లన్న గట్టిపోటీ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాగర్ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్‌కు తీన్మార్ మల్లన్న గండం ఎదురుకావొచ్చని చెబుతున్నారు. ఓ సామాన్యుడినైన తనకు పట్టభద్ర నియోజవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన అంటున్నారు. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ 100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందని, దొంగ ఓట్లు వేయించుకుందని, ఫలితంగా మూడు శాతం ఓట్లతో ఓడిపోవాల్సి వచ్చిందని తీన్మార్ మల్లన్న పేర్కొంటున్నారు.