Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పై నాంపల్లి కోర్టు నిర్ణయం ఇదే..!
హైదరాబాద్ సంథ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా షో చూసేందుకు వెళ్లి తొక్కిసలాటకు, ఓ మహిళ మృతికి కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ గతంలో తనకు నాంపల్లి కోర్టు ఇచ్చిన రెండు వారాల రిమాండ్ పూర్తి కావడంతో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 4న సంధ్య థియేటర్ ఘటన జరిగిన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు.. రెండు రోజులకు అల్లు అర్జున్ ను ఏ 11గా ఇందులో చేర్చారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన కోర్టు.. అల్లు అర్జున్ ను రెండు వారాల పాటు రిమాండ్ కు పంపింది. అయితే అప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్.. నాంపల్లి కోర్టు రిమాండ్ నేపథ్యంలో హైకోర్టును మధ్యంతర బెయిల్ కోరారు. దీంతో హైకోర్టు నాలుగు వారాల పాటు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది.

అయితే నాంపల్లి కోర్టు ఇచ్చిన రెండు వారాల రిమాండ్ గడువు పూర్తి కావడంతో అల్లు అర్జున్ కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. దీంతో పాటే ఆయన రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే కేసులో పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ ను వ్యతిరేకించారు. ఇవాళ అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ పిటిషన్ పై ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications