హైదరాబాద్ అభివృద్ధి: నాన్నల పేర్లతో లోకేష్, కెటిఆర్ గ్రేటర్ ఫైట్
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.టి. రామారావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ హైదరాబాద్ అభివృద్ధిపై విమర్శలూ ప్రతివిమర్శలూ చేసుకుంటున్నారు. తమ నాన్నల పేర్లతో వారు గ్రేటర్ ఫైట్ సాగిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి తమ నాన్న చంద్రబాబు నాయుడి పుణ్యమే అని నారా లోకేష్ అంటే, తమ నాన్నను చూసి హైదరాబాద్‌కు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని కెటిఆర్ అంటున్నారు.
హైదరాబాద్ అభివృద్ధి అంతా తమ నాన్న పుణ్యమేనని అంటూ చంద్రబాబు లేకుంటే హైదరాబాద్‌కు ఇంత ఖ్యాతి వచ్చేదా అని లోకేష్ అడిగారు. తమ తండ్రి చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధిగా జరిగిందని ఆయన అన్నారు. హైదరాబాదులో ఐటి విస్తరించడానికి చంద్రబాబు కృషే కారణమని ఆయన అన్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటి కంపెనీలు తెలంగాణకు ‘క్యూ' కట్టాయని కెటిఆర్ అన్నారు. తమ నాన్న కెసిఆర్‌ను చూసి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ఆయన అన్నారు. పేదలు గౌరవంగా బతకాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు.
అందుకే పేదల కోసం రెండు పడకల గదుల ఇళ్ళ నిర్మాణ చేపట్టారని ఆయన చెప్పారు. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు చేయలేని పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపిస్తున్నారని ఆయన తెలిపారు.
కాగా, కెటిఆర్ బుధవారం ఓ అడుగు ముందుకు వేసి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదుకు అన్నీ తానే చేశానని చంద్రబాబు చెబుతున్నారని, ఇంటర్నెట్‌ను కూడా తానే కనిపెట్టానని కూడా చెబుతారని కెటిఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications