రూపాయి కట్టకుండానే రూ.5లక్షల బీమా, దరఖాస్తులు 18వరకే .. త్వరపడండి!
చేనేత కార్మికులకు శుభవార్త. చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్రపరిశ్రమలోని అనుబంధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఒక ముఖ్యమైన బీమా పథకం అందిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. చేనేత, జౌళి శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 'నేతన్న భద్రత' పథకంలో చేరే కార్మికులు ఈ బీమా పొందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా కార్మికుల కుటుంబాలకు ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు ఆర్థిక భద్రత కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వీరికి ఈ బీమా పథకంలో అవకాశం
చేనేత మగ్గాలు నడిపే కార్మికులు, పవర్‌లూమ్స్ నడిపే వారు ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది. అంతేకాకుండా వస్త్రపరిశ్రమకు సంబంధించిన అనుబంధ రంగాల్లో పనిచేసే వారు కూడా ఇందులో చేరవచ్చని చేనేత మరియు జౌళి శాఖ పేర్కొంది. డయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్, వైపింగ్, రోలింగ్ (గమ్మింగ్), డ్రాయింగ్, బ్లీచింగ్ వంటి పనులు చేసే కార్మికులు కూడా ఈ బీమా పథకంలో చేరే అవకాశం ఉంది.

కార్మిక కుటుంబానికి రూ.5 లక్షల బీమా
ఈ రంగాలన్నీ చేనేత, వస్త్రపరిశ్రమకు అనుబంధంగా ఉండి, వేలాది మంది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్నాయి. ఈ పథకంలో చేరిన కార్మికులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. ఏ కారణం చేతనైనా కార్మికుడు మరణిస్తే, అతని కుటుంబానికి రూ.5 లక్షల బీమా సదుపాయం అందుతుంది. ఇది ఆకస్మిక మరణాల్లో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, రక్షణ కల్పించే ముఖ్యమైన చర్యగా చెప్పవచ్చు.
ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి
చేనేత, జౌళి శాఖ ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అర్హులైన కార్మికులు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత చేనేత, జౌళి శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేయాలని కోరింది. దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు, గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. సమయం మించిపోతే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
నేతన్న భద్రత పథకం ద్వారా కార్మికులకు కనీస ఆర్థిక రక్షణ
చేనేత రంగం సాంప్రదాయకంగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోంది. అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతన్నలకు ఆకస్మిక ప్రమాదాలు వారి కుటుంబాలను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. నేతన్న భద్రత పథకం ద్వారా కార్మికులకు కనీస ఆర్థిక రక్షణ లభించనుంది.రూపాయి కూడా కట్టకుండా ఈ పథకంలో చేరితే ఆకస్మిక మరణం సంభవిస్తే రూ.5లక్షల బీమా సదుపాయం అందుతుంది.













Click it and Unblock the Notifications