కొత్త మద్యం బ్రాండ్లు సిద్దం - అమ్మకాలు, ధరలపై కొత్త ఫార్ములా..!!
మందుబాబులకు గుడ్ న్యూస్. కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 603 మద్యం బ్రాండ్లు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి కోసం కంపెనీలు వేచి చూస్తున్నాయి. ఇందులో ఇప్పటి వరకు రాష్ట్రంలో వినియోగం లో లేని జాతీయ - అంతర్జాతీయ బ్రాండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్రాండ్ల ఎంట్రీ వేళ ఫీజులు.. అమ్మకాల పైన కొత్త ఫార్ములా అమలుకు వీలుగా ప్రతిపాదనలు సిద్దమైనట్లు సమాచారం.
తెలంగాణలో ప్రవేశించేందుకు కొత్తగా 603 మద్యం బ్రాండ్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో 1956 మద్యం బ్రాండ్‌లు చలామణిలో ఉన్నాయి. కొత్తగా వేచి చూస్తున్న వాటిల్లో 603 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఉన్నట్లు సమాచారం. వీటి అనుమతి కోసం సుమారు 97 కంపెనీలు ఇటు రాష్ట్ర ఎక్సైజ్.. ప్రభుత్వం చుట్టూ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల ఎక్సైజ్‌శాఖ అధికారులకు భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) పట్టుబడింది. ఆ మద్యం సీసాల్లో లోకల్ బ్రాండ్‌లు లేని విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ ఎన్డీపీఎల్‌లో అత్యధికశాతం మన దగ్గర అందుబాటులో లేని జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లే ఉంటున్నాయని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు.
దీంతో, కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఈ ఎన్డీపీఎల్ బాధ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే విధంగా కొత్తవాటికి అనుమతిస్తే.. ఒక్కో బ్రాండ్‌కు రూ.15 వేల చొప్పున అనుమతి ఫీజును వసూలు చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.90,45,000లు రాబడి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో 13 బీర్ కంపెనీలు, 51 జాతీయ లిక్కర్ కంపెనీలు, 27 విదేశీ లిక్కర్ కంపెనీల నుంచి 86 రకాల బీర్ బ్రాండ్‌లు, 770 రకాల ఇండియన్ లిక్కర్ బ్రాండ్‌లు, 1091 విదేశీ లిక్కర్ బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణలో కొత్తగా బీర్లు, మద్యం సరఫరా చేయాలనుకునే కంపెనీల కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వాటిల్లో కొన్ని కంపెనీలు ఇప్పటికే 603 రకాల బ్రాండ్‌లను ప్రవేశపెట్టేందుకు అనుమతుల కోసం తిరుగుతున్నాయి. ప్రభుత్వం మద్యం వ్యవహారంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వం ఈ బ్రాండ్లకు అనుమతి ఎప్పుడు ఇస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications