పెళ్లై వారం కాకముందే పరారయ్యాడు: పీఎస్‌లో నవ వధువు ఫిర్యాదు
హైదరాబాద్: పెళ్లి చేసుకున్న వారం రోజులకే తన భర్త తనను కాదని పోయాడని ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లాకు చెందిన యువతి (25) సోమాజిగూడలోని వివేకానంద ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుంది.
ఈమెకు పార్క్ హోటల్‌లో విధులు నిర్వహించే హర్యానాకు చెందిన కపిల్ రోహిరా(26)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారి గత నవంబర్ 28వ తేదీన వీరు వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కేవలం వారం రోజులకే కపిల్ కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి అతని ఫోన్ కూడా ఆఫ్‌లో ఉంది.
కాగా, సుమారు 10 నెలల తర్వాత కపిల్ సోమాజిగూడ ప్రాంతంలో సదరు యువతికి కనిపించగా ఆమె అతన్ని కలిసి తనను ఎందుకు వదిలి వెళ్లావు అని ప్రశ్నించగా.. ‘నీవంటే నాకు ఇష్టంలేదని అందుకే వెల్లిపోయాను' అని సమాధానం చెప్పాడు.

దీంతో ఆ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు కపిల్ కోసం గాలింపు చేపట్టారు.
ఇళ్లు దోచేస్తున్న నేరస్తుడిపై పీడీ యాక్ట్
జైలు శిక్ష పడ్డా తన నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇళ్లల్లో దొంగతనం చేసే నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ కథనం ప్రకారం.. యాకుత్‌పురా బాగ్ ఈ జహరాకు చెందిన సయ్యద్ నూర్ మహ్మద్ అలియాస్ ఎం. అర్షద్ కాచిగూడ, సైఫాబాద్, సుల్తాన్‌బజార్, కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో తొమ్మిది కేసులు ఇతనిపై ఉన్నాయి.
ఇందులో 7 కేసులలో 14 నెలల పాటు జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయిన తర్వాత కూడా దొంగతనాలు చేస్తుండడంతో గత నెలలో కాచిగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇతనిపై పీడీ యాక్టు పెట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications