చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వైద్యులు.. సూది గుచ్చకుండానే రక్త పరీక్ష.. ఎలాగో తెలుసా..?
సాధారణంగా రక్త పరీక్ష చేయాలంటే సూది గుచ్చి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ బ్లడ్ టెస్టింగ్ నిర్వహిస్తారు. కానీ ఇవేమీ లేకుండా కేవలం ఫేస్ స్కానింగ్ తోనే రక్త పరీక్ష చేసేలా హైదరాబాద్ వైద్యులు సరికొత్త విధానం తీసుకొచ్చారు. అవును మారుతున్న సాంకేతిక యుగాన్ని అందిపుచ్చుకుని ఏఐ ఆధారంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో ఏఐ బ్లడ్ టెస్టింగ్ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఈ అరుదైన ఘనత సాధించారు.
హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రి అయిన నీలోఫర్ చరిత్ర సృష్టించింది. అక్కడి వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. రక్త పరీక్షలో కృత్రిమ మేథస్సు(ఏఐ) ఆధారంగా ఓ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో రక్తపరీక్షకు సూది గుచ్చకుండానే కేవలం ఫేస్ స్కానింగ్ తో నిర్వహించవచ్చు. ఈ అద్భుతమైన టూల్ ను తీసుకొచ్చారు నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు.
ఈ ఏఐ టూల్ ఉపయోగించి కేవలం 20 నుంచి 60 సెకన్ల వ్యవధిలోనే రక్త పరీక్ష నిర్థారణ చేసుకోవచ్చు. అంతేకాక ఈ టూల్ వినియోగించి బీపీ, ఆక్సిజన్ స్థాయిలను కూడా అంచనా వేయొచ్చు. ఈ టూల్ కు అమృత్ స్వస్థ్ భారత్ అని పేరు పెట్టారు. ఈ టూల్ ద్వారా ఒక్క బొట్టు కూడా రక్తం లేకుండా ఫేస్ స్కానింగ్ తో కేవలం 20 నుంచి 60 సెకన్లలోనే రక్త పరీక్ష పూర్తవుతుంది.

అమృత్ స్వస్థ్ భారత్ యాప్ మిగతా పరికరాల మాదిరి కాకుండా ఫోటోప్లీతిస్మోగ్రఫీ(పీపీజీ) సాంకేతికతను వినియోగిస్తుంది. ఈ సాంకేతికత ద్వారా ఓ కాంతిని శరీరంలోకి ప్రవేశ పెడతారు. ఆ కాంతి దశలను గుర్తిస్తూ ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారు. ఈ యాప్ ద్వారా కేవలం రక్త పరీక్ష మాత్రమే కాదు.. బీపీ, ఆక్సిజన్ స్థాయి పరీక్ష, హార్ట్ రేటు, హార్ట్ రేటు వేరియబిలిటీ, హీమోగ్లోబిన్, స్ట్రెస్ లెవెల్స్, పల్స్ రెస్పిరేటరీ కోషియంట్ లాంటి పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ ఘనతపై నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడారు. పేద బలహీన వర్గాల ప్రజలకు ఈ పరికరం ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు. అధిక సంఖ్యలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు. ఈ అమృత్ స్వస్థ్ భారత్ యాప్ సురక్షితమైనదని.. పిల్లలు, మహిళలు, వృద్దులకు ఉపయోగపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications