బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల నైవేద్యాలు ఇవే..!
తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. 'బతుకమ్మ' పండుగను రాష్ట్రంలో భాద్రపద మాస అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల బతుకమ్మ పండుగ దసరా కు రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ అంటేనే ప్రకృతి పండుగ అని అర్థం. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన ఈ పండుగ, సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది. మరి ఈ 9 రోజుల పాటు నైవేద్యాలు ఏమేమి పెడతారో తెలుసుకుందాం.
ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటిరోజు ప్రారంభం అవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు.. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
నానబియ్యం బతుకమ్మ : నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ : అట్లు, దోసెలతో నైవేద్యం చేస్తారు.
అలిగిన బతుకమ్మ: ఈ రోజు నైవేద్యం ఉండదు.
వేపకాయల బతుకమ్మ: బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
ఇక సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు వస్తుంది. అదేరోజు దుర్గాష్టమిని కూడా జరుపుకుంటారు. ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం ఉంటాయి.












Click it and Unblock the Notifications