పాత గాయాలు రగిల్చే కుట్రలు: చంద్రబాబు, రేవంత్ భేటీపై నిరంజన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలు పూర్తవుతున్నా.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనపైనా ఆయన సెటైర్లు వేశారు. ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదంటూ రేవంత్, చంద్రబాబు భేటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి ఎవరి మానాన వారు బతుకుతున్నారన్నారు. కానీ, కానీ, మానిన గాయాలను మళ్లీ రగిల్చేందుకు చంద్రబాబు, రేవంత్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండటం అభ్యంతరం లేదు.. కానీ, ఇక్కడ మేం మళ్లీ మా పాత్ర పోషిస్తామని రాజకీయ ఆర్భాటాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీపై విమర్శలు గుప్పించారు.

'చంద్రబాబు ఆంధ్రాలో సీఎం అయ్యారు. తెలంగాణ రాజధానిలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదు. పెళ్లికొడుకు ఒకచోట.. పెళ్లి ఒకచోట.. పందిరి మాత్రం తెలంగాణలో వేస్తున్నారు. ఆర్భాటం హైదరాబాద్‌లో చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆర్భాటం ఎందుకు..? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అపరిష్కృత అంశాల మీద చర్చ అనుకుంటే ఆ అడుగులు వేరేలా ఉండేవి. కానీ అలా లేవు. పరోక్షంగా తెలంగాణను పరిపాలించేటటువంటి కుట్ర ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను' అని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన సవ్యంగా లేదని.. ప్రజలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఉందన్నారు నిరంజన్ రెడ్డి. నిరుద్యోగులను, యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. కానీ, ఇవాళ నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వినడం లేదని మండిపడ్డారు. టీజీపీఎస్సీ వద్ద వద్ద కంచెలు వేయించి అమానుషంగా నిరుద్యోగులను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.
అంతేగాక, చివరకు రహదారిపై వెళ్తున్న దంపతులను, రైతులను కూడా అరెస్టు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు కట్టుబడి ఉందా..? మేనిఫెస్టోలో పేర్కొన్న గ్యారెంటీలు ఏమయ్యాయి? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఓట్ల తేడాతోనే పరాజయం పాలైందని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications