తెలంగాణలో లాక్‌డౌన్ మళ్లీ విధిస్తారా?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, సహకరించాలని పిలుపు
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠినం చేయడంతోపాటు పలు నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరోసారి లాక్‌డౌన్ పెడతారనే ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో లాక్‌డౌన్ ఆలోచన లేదన్న శ్రీనివాసరావు
ఈ నేపథ్యంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే ఆలోచనేది లేదని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ద్వారా ఇంట్లోని వారికి కరోనా సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని పిలుపు
పాజిటివ్ కేసుల పెరుగుదలను బట్టే సెకండ్ వేవ్ అని భావిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అర్హులందరూ టీకా వేయించుకోవాలని, వ్యాక్సినేషన్ పెరిగితే వైరస్ నియంత్రణలోకి వస్తుందని అన్నారు. కరోనా నియంత్రణకు గత సంవత్సరం ఎలాంటి చర్యలు చేపట్టామో.. ఇప్పుడూ అవే మళ్లీ ప్రారంభించామని శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల అప్రమత్తతోనే కరోనా నియంత్రణ సాధ్యమని చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
ఇది ఇలావుండగా, గత 24 గంటల్లో 37,079 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 337 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1671కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 91 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారినుంచి 181 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,98,826కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2958కి చేరింది. వీరిలో 1226 మంది హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 96,50,662కి చేరింది.












Click it and Unblock the Notifications