ధైర్యంగా చెబుతున్నాడంటే: పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి, తప్పుగా అర్థం చేసుకున్నారా?
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ ఇటీవల అందరి నోళ్లలో నానుతున్న మహేష్ కత్తి.. జనసేనానిపై ఆదివారం మరోసారి విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ ఇటీవల అందరి నోళ్లలో నానుతున్న మహేష్ కత్తి.. జనసేనానిపై ఆదివారం మరోసారి విమర్శలు గుప్పించారు.
శనివారం పవన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అలాగే రిజర్వేషన్ల అంశంపై కూడా మాట్లాడారు. రిజర్వేషన్లు లేని సమాజం కావాలని ఆకాంక్షించారు. దీనిపై కత్తి మహేష్ మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ నైజం బయటపడింది
'రిజర్వేషన్లు లేని సమాజమే అంబేడ్కర్‌కు నివాళి' అన్న పవన్ వ్యాఖ్యలను ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీనికి మహేష్ కత్తి రిప్లై ఇచ్చారు. 'నౌ హీ ఈజ్ ఔట్ అండ్ ఓపెన్. పికె ఈజ్ యాంటీ దళిత్' అని కామెంట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన నైజం బయట పెట్టుకున్నాడని, అతను దళిత వ్యతిరేకి అని అభిప్రాయపడ్డారు.

పవన్ తెలియనితనం
తన ఫేస్‌బుక్‌లోను మహేష్ ఓ పోస్ట్ పెట్టారు. 'రాజ్యాంగం మీద అవగాహన. రాజకీయ పరిణితి చాలా దూరం. కనీసం కామన్ సెన్స్ లేని ఇలాంటి స్టేట్మేంట్స్ పవన్ కళ్యాణ్ తెలియనితనాన్ని సూచిస్తున్నాయి. తరతరాల రిజర్వేషన్ల అమలులోని అవకతవకలతో పోరాడుతూ, ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్న కోట్ల మంది దళితుల గురించి మాట్లాడని ఇతను. దళిత సమస్యలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం ట్విట్ చెయ్యని ఇతను. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు. కనీసం 1% కూడా లేని క్రిమిలేయర్ పెద్ద సమస్య అన్నట్టు పోజులిస్తున్నాడు. అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం మాట్లాడిన అక్షరం అక్షరం కనిపిస్తున్నాయి.' అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఇంత ధైర్యంగా చెబుతున్నాడంటే..
'ఇప్పుడే కదా కాపులు తమ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. ముద్రగడ గురించి మాట్లాడమంటే, సెన్సిటివ్ విషయాలపై స్పందించను అనే ఈ పలాయనవాది, దళితుల రిజర్వేషన్ల నిర్ములనే ధ్యేయంగా ఉన్నట్టు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో చూస్తే, ఇతని దళిత వ్యతిరేకత సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జనసేన పంథా అయితే, ఇదే ఇతగాడి "స్థాయి" అయితే, మనం తీవ్రంగా ఆలొచ్చించాల్సిన విషయం.' అని పేర్కొన్నారు.

పోస్టుల వెల్లువ
కత్తి మహేష్ - పవన్ కళ్యాణ్ పోస్టులకు అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్లు వస్తున్నాయి. తప్పులేదన్నా రిజర్వేషన్లు తీసేయాలని ఒకరు, ఇలాంటి స్పీచ్‌లు ఎవరైనా ఇస్తారని మరొకరు, బాగా చెప్పారని ఇంకొకరు.. పోస్టులు పెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారా?
పవన్ కళ్యాణ్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారనేది ఇంకొందరి వాదన. పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ల గురించి మాట్లాడారు తప్పితే ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పలేదని అంటున్నారు. నాడు అంబేడ్కర్ రిజర్వేషన్లు లేని సమాజం కోరుకున్నారని, కులరహిత సమాజం నిర్మితమై, రిజర్వేషన్లు లేని సమాజం ఉండాలనేదే పవన్ కళ్యాణ్ అభిప్రాయమని, దీనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కాపులకు రిజర్వేషన్ పైన..
కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కాబట్టి ఆ హామిని నిలబెట్టుకోమని పవన్ అడుగుతున్నారని గుర్తు చేస్తున్నారు. తనకు కులం, మతం పట్టింపు ఉండదని మొదటి నుంచి చెబుతున్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి కులరహిత సమాజం నిర్మితమై, అందరూ సమానంగా జీవించాలని, తద్వారా రిజర్వేషన్లు ఉండకూడదనేది ఆయన ఉద్దేశ్యమని అంటున్నారు.

కాపు రిజర్వేషన్ల నేపథ్యంలోనే ప్రస్తావన
కాపులకు రిజర్వేషన్లు, ముద్రగడ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆ ప్రస్తావన తెచ్చారు. వ్యక్తిగతంగా తనకు రిజర్వేషన్లు నచ్చవని, అయితే రిజర్వేషన్ ఇస్తామన్న టిడిపి కాపులకు ఆ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వండి.. లేదంటే ఎందుకు ఇవ్వడం లేదో చెప్పండని సూచించారు. ఇంకా మాట్లాడుతూ.. ఒక వ్యక్తి (ముద్రగడ) తన నిరసన తెలియజేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ముద్రగడ పాదయాత్రను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, ఆయనను పోలీసులు అడ్డుకోవడం తప్పని పవన్ చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. అంబేడ్కర్ కూడా రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండాలని కోరుకోలేదని, ఒక కాల పరిమితి వరకే వాటిని సమర్థంగా అమలు చేసి అనంతరం ఎత్తివేయాలని చెప్పారని గుర్తు చేశారు. అసలు రిజర్వేషన్లు లేని సమసమాజ సాధనే అంబేడ్కర్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. కాపుల గురించి వచ్చినప్పుడు రిజర్వేషన్ల గురించి పవన్ మాట్లాడారని, అలాగే రిజర్వేషన్లు లేని సమసమాజం అని చెప్పారని, దీనిని గుర్తించాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications