తెలంగాణ తల్లి రూపంపై అభ్యంతరం: ప్రజాధనం వృథా అంటూ హైకోర్టులో పిల్
రేవంత్ రెడ్డి సర్కారు కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చవద్దంటూ ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్.. రేవంత్ రెడ్డి సర్కారును కోరారు. అయితే, తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి రూపం వెల్లడైంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి రూపంపై బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, సచివాలయంలో నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో శనివారం పిటిషన్ దాఖలైంది. సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్, రచయిత జూలూరీ గౌరీశంకర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడంపై తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో అభ్యంతరం వ్యక్తం చేశారు గౌరీశంకర్. ప్రజల మనోభావాలతో కూడుకున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం తగదని ఆయన పేర్కొన్నారు. కాగా, సచివాలయంలో డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసేలా జరిగిన ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎంతో కీలక పాత్ర పోషించిందని పిటిషన్‌లో వివరించారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, మాజీ సీఎం కేసీఆర్ తోపాటు ఎంతో మంది మేధావులు కలిసి ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు పిటిషన్‌లో తెలిపారు. ఇప్పుడు విగ్రహ రూపంలో అనేక మార్పులు చేశారని పేర్కొన్నారు.
అంతేగాక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలిపారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వివరించారు. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న విగ్రహాన్ని మార్చొద్దని గౌరీ శంకర్ హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో కోరారు.












Click it and Unblock the Notifications