తెలంగాణలో మారుతున్న లెక్కలు - అధికారం వారికే, కలిసొచ్చేదిలా..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం రాజుకుంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ప్రధానంగా కనిపిస్తోంది. రెండు పార్టీలు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హ్యాట్రిక్ మిస్ కాకూడదనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. నవ్ ఆర్ నెవర్ అనే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ మీద ఫోకస్ చేసింది. బీజేపీ పోరాటం చేస్తోంది. ఈ సమయంలో సర్వేలు మాత్రం గెలుపు లెక్కలను తేల్చుతున్నాయి. అసలు తెలంగాణలో అధికారం దక్కేదెవరికి..లెక్కలు ఏం చెబుతున్నాయి.
కొత్త సమీకరణాలు
తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో పాటుగా గులాబీ నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రతీ నియోజకవర్గం నుంచి ప్రచార తీరు తెన్నులు..ప్రతిపక్షాల ఎత్తులపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా వార్ రూమ్ లు ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తోంది. తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తోంది. అటు కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితా విడుదల చేసింది.

రెండో జాబితా వేళ ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలు తమ పార్టీలో చేరిక ఆధారంగా సీట్ల కసరత్తు చేస్తోంది. నేరుగా రాహుల్ - ప్రియంక తెలంగాణలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ ముఖ్య నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. అయితే, తెలంగాణలో ఇతర పార్టీలతో బహుముఖ పోటీ కనిపిస్తున్నా..ప్రధానంగా మాత్రం త్రిముఖ పోటీ..ఇంకా పక్కాగా చెప్పాలంటే కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్
కాంగ్రెస్ తాము ప్రకటించిన ఆరు పథకాల గ్యారంటీ కార్డు తమకు ఓట్ల పంటగా మారుతుందని అంచనా వేస్తోంది. అంతకు మించి అన్నట్లుగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. అందులో ప్రతీ ఇంటి పెద్దకు భీమా ప్రకటించారు. అదే విధంగా పెన్షన్ పెంపు..ప్రతీ మహిళకు ఆర్దికంగా చేయూత..సబ్సిడీ పై గ్యాస్ సిలిండర్..రైతు భరోసా పెంపు వంటి నిర్ణయాలను మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు తెలంగాణ ఆర్దిక సమస్యల్లో అమలు సాధ్యం కాదని పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే..దశల వారీగా హామీల అమలు పైన క్లారిటీ ఇస్తోంది. అసలు కాంగ్రెస్ లో సీఎం అభ్యర్ది ఎవరని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీకి మైనస్ గా కనిపిస్తోంది. నాలుగు జిల్లాల్లో మినహా కాంగ్రెస్ బలం పెరగలేదనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విశ్లేషణ. బీజేపీ కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక ఖాయమని గులాబీ నేతలు లెక్కలు వేస్తున్నారు.
హ్యాట్రిక్ ఖాయమనే ధీమా
ఇక, సర్వేలు సైతం బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తున్నాయి. కాంగ్రెస్ పుంజుకున్నా..బీఆర్ఎస్ కు గట్టి పోటీకి మాత్రమే పరిమితం అవుతుందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో సామాజిక స్థితి గతులు..ప్రధానంగా హైదరాబాద్ లో ఈ పదేళ్ల కాలంలో వచ్చిన మార్పులు బీఆర్ఎస్ కు అనుకూల అంశాలుగా మారుతున్నాయి. పాలనా పరంగా ట్రాక్ రికార్డు అదనపు అడ్వాంటేజ్ గా మారుతోంది.
రాజకీయం గా కేసీఆర్ వ్యూహాలను పసిగట్టి..ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో ధీటుగా వ్యవహరించగలిగిన నేతలు కాంగ్రెస్, బీజేపీలో లేకపోవటం బీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశం. కాంగ్రెస్, బీజేపీలో ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలు..సామాజిక సమీకరణలు గులాబీ నేతల్లో మరింత ధీమా పెంచుతున్నాయి. పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం కేసీఆర్..ట్రబుల్ షూటర్స్ గా కేటీఆర్ - హరీష్ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం ఇప్పటికే ఎన్నికల యుద్దంలోకి దిగారు.దీంతో...మూడో సారి అధికారం బీఆర్ఎస్ దేనని..కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టటం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications