మా ఇంటిపై ఆరోపణల్లో నిజం లేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
తమ ఇల్లు విషయంలో వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైదరాబాద్ మధురానగర్‌లో తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
'సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. 44 ఏళ్ల క్రితం మా నాన్న నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారు. కృష్ణకాంత్ పార్క్‌కు మా ఇంటికి మధ్య వేలాది ఇల్లు ఉన్నాయి. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రావు. మా ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటర్ దూరం ఉంది' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని ఖండిస్తున్నానని అన్నారు. 44 ఏళ్ల క్రితం నిర్మించిన అదే ఇంట్లో తన తండ్రితో కలిసి ఉంటున్నట్లు తెలిపారు. కాగా, యూసఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్‌లోనే ఉందని.. అది ఒకప్పటి చెరువు అని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు.
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులను ఆక్రమించిన కట్టడాలను హైడ్రా కూలుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం పేదల ఇళ్లను, ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చబోమని అన్నారు. అయితే, అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను, చెరువులను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications