"మార్పు" వచ్చేనా, చివర్లో మారిన లెక్కలు - ఓటింగ్ లో ఏం తేల్చారు..!!
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ శాతం భారీగా నమోదైనట్లు కనిపిస్తోంది. ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఈ సారి హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో ఈ సారి యువ పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొంది. వీరి ఓట్లతో పార్టీలు కోరుకుంటున్న "మార్పు" వస్తుందా. వీరి ఎవరికి వైపు మొగ్గు చూపారు. తెలంగాణలో ఎన్నికల ఫలితం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.
హోరా హోరీ పోరు : ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగింది. ప్రధాన పార్టీలు యువత..మహిళలను టార్గెట్ గా తమ హామీలు గుప్పించాయి. రాష్ట్రం మొత్తం ఓటర్లు 3,26,18,205 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,63,13,268 మంది పురుషులు కాగా, 1,63,02,261మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 18-19 ఏళ్లు ఉన్న ఓటర్లు - 9,99,667 ఉన్నారు. ఈ సారి ఓటు వేసేందుకు హైదరాబాద్ తో పాటుగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ - బీజేపీ మధ్య కొనసాగిన ముక్కోణపు పోటీలో వీరి ఓట్లు అధికారాన్ని డిసైడ్ చేయనున్నాయి. యువత ఓటింగ్ తమకే అనుకూలమని మూడు పార్టీలు ధీమాగా చెబుతున్నాయి.

యువత మద్దతు ఎటు : ఈ సారి తెలంగాణలో ఉద్యోగ కల్పన, జాబ్ నోటిఫికేషన్లు యువత పైన ప్రధానంగా ప్రభావం చూపాయి. అదే సమయంలో తెలంగాణలో విస్తరించిన ఐటీ, ప్రయివేటు సంస్థల ఏర్పాటు కూడా ఉపాధికి దోహదం చేసింది. హైదరాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రధానంగా ప్రచారం చేసింది. భవిష్యత్ ఉండాలంటే తమకే ఓటు వేయాలని కోరింది. అయితే, హైదరాబాద్ లో స్థిర నివాసం ఉండే వారు మాత్రం ఓటింగ్ కు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గింది. జిల్లాల్లో ఉన్న యువత మాత్రం పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నది. ఈ పోలింగ్ సరళి చూసిన వారు యువత సంక్షేమం కంటే తమకు మద్దతుగా నిలిచే పార్టీల వైపు ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఉద్యోగ కల్పనతో పాటుగా ఒక జాతీయ పార్టీకి అనూహ్యంగా టర్న్ అయినట్లు గ్రౌండ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి.
ఓటింగ్ సరళి ఏం చెబుతోంది : ఇక, పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి కలిసి వస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. 2018 ఎన్నికల్లో 73.7 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి అంతకంటే దాటుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. మెదక్ వంటి జిల్లాల్లో 90 శాతం వరకు పోలింగ్ చేరుకొనే అవకాశం కనిపిస్తోంది. గ్రామీణ నియోజవకర్గాల్లో భారీగా నమోదైన పోలింగ్ ఏ పార్టీకి కలిసి వస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. కొత్తగా ఓటర్లుగా చేరిన యువత ప్రభావం వారి కుటుంబ సభ్యుల మీద కనిపించింది. ఎన్నికల సంఘం అధికారికంగా మధ్నాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ప్రకటించింది. దీంతో..ఇప్పుడు ఓటింగ్ సరళిపైన అన్ని పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నా...అసలు ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications