కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి.. టీఆర్ఎస్, బీజేపీలకు పాల్వాయి స్రవంతి సవాల్
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతుంది. మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడును పెంచాయి. ఇక ప్రచారంలో వెనుకబడిందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచార వేగాన్ని పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాటల తూటాలను పేలుస్తూ, మునుగోడు లో ప్రత్యర్థి పార్టీలను సవాల్ చేస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి పాల్వాయి స్రవంతి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డి తన పద్దతి మార్చుకోవాలి.. లేదంటే జరిగేది ఇదే: పాల్వాయి స్రవంతి
మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పాల్వాయి స్రవంతి బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ఆయన తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజగోపాల్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాల్వాయి స్రవంతి హెచ్చరించారు. గట్టుప్పల్ మండలం లో రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, కాంట్రాక్ట్ లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పిచ్చి వేషాలు వేస్తున్నారని, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లగొట్టాలని, లేదంటే బిజెపి కార్యకర్తలు వచ్చి తంతారు అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ పాల్వాయి స్రవంతి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించి, కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థి ఎవరో? ప్రజలకే అయోమయం
అంతేకాదు బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు కలిసి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని పాల్వాయి స్రవంతి వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థి ఎవరో చెప్పాలని ప్రశ్నించిన పాల్వాయి స్రవంతి మునుగోడు అభ్యర్థి కేటీఆర్ నా? హరీష్ రావు నా? లేక జగదీష్ రెడ్డి నా అంటూ ప్రశ్నించారు. ప్రజలలో కూడా ఈ గందరగోళం ఉందని పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. ఇక పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని విమర్శిస్తున్న నేతల పై మండిపడిన ఆమె ఆయన పేరు ఉచ్చరించే అర్హత కూడా సదరు నేతలకు లేదని తేల్చి చెప్పారు.

టీఆర్ఎస్, బీజేపీ నేతలకు పాల్వాయి స్రవంతి సవాల్
ఇదే సమయంలో ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికలకు పోదామన్న పాల్వాయి స్రవంతి ఈ విషయంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వద్ద ప్రమాణం చేద్దామా అంటూ టిఆర్ఎస్, బిజెపి నేతలకు సవాల్ విసిరారు. కానీ తాను స్వలాభం కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కానని పాల్వాయి స్రవంతి స్పష్టం చేశారు. అమ్ముడు పోయేవారిని ఆదరించొద్దు అంటూ ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల పోరులో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు సెంటిమెంట్ తో వెళుతున్న పాల్వాయి స్రవంతి, ప్రత్యర్ధి పార్టీల పైన తనదైన దూకుడును చూపిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications