కొంగు చాచి అడుగుతున్నా.. మునుగోడు ప్రచారంలో కన్నీళ్లు పెట్టుకున్న పాల్వాయి స్రవంతి
మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ను పెంచుతుంది. మునుగోడు ఉపఎన్నిక కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచార పర్వంలో దూకుడు పెంచనున్నారు. మునుగోడు ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మునుగోడులో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భావోద్వేగం
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కావటంతో ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి పాల్వాయి స్రవంతి మునుగోడు ఉప పోరులో ఎదురీదుతున్నారు. పార్టీలో కలిసి వచ్చే వారు ఎవరు అన్నది తేల్చుకోలేకపోతున్న పాల్వాయి స్రవంతి కనీసం ఓటర్ల మనసు అయినా గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఓటర్లలో సెంటిమెంట్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న పాల్వాయి స్రవంతి
ఇప్పటికే ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్న ఆమె ఇంటింటికీ తిరుగుతూ తననుగెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. చివరి రోజు నామినేషన్ దాఖలు చేసిన పాల్వాయి స్రవంతి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఓటర్లలో సెంటిమెంట్ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆడబిడ్డను వచ్చాను.. ఆదరించండి: పాల్వాయి స్రవంతి
గద్గద స్వరంతో తండ్రిని గుర్తు చేసుకున్న పాల్వాయి స్రవంతి, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఆడబిడ్డను వచ్చాను.. ఒకసారి నన్ను గుర్తుంచుకోండి అంటూ విజ్ఞప్తి చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్న పాల్వాయి స్రవంతి తన తండ్రిని గుర్తు చేసుకుని, నాన్నలేని లోటు నాకు ఈరోజు తెలుస్తుంది అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇక్కడ ఉన్న మీరందరూ నా తోబుట్టువులై, నా తండ్రి స్థానం తీసుకొని, నాతో పాటు నడవాలని, నా చేతులు చాచి, నా కొంగు చాచి ప్రాధేయ పడుతున్నాను అంటూ పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు.
కన్నీళ్ళతో అభ్యర్థించిన పాల్వాయి స్రవంతి
ఈ ఎన్నికలలో మీరంతా ప్రతి ఒక్కరూ మీ ఒకే ఒక్క ఓటు నాకు వేయండి అంటూ పాల్వాయి స్రవంతి కన్నీటితోనే అభ్యర్థించారు. మునుగోడు నియోజకవర్గం నుండి ఆడబిడ్డగా పోటీ చేస్తున్న తనను ఆదరించాలని, తన తండ్రి మునుగోడు చేసిన సేవను గుర్తించాలని పాల్వాయి స్రవంతి భావోద్వేగంతో చేస్తున్న ఎన్నికల ప్రచారం ప్రజలను ఆలోచించేలా చేస్తోంది. మరి ఇదంతా పాల్వాయి స్రవంతి ఓటు బ్యాంకుగా మారుతుందా? లేదా అన్నది? తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications