కన్నవాళ్లే బిడ్డను బలితీసుకున్నారు: ఎందుకంత కర్కషత్వం, వీడిన మిస్టరీ..
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తులేకుర్ధులో బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. తల్లిదండ్రులే బాలికను హతమార్చారని నిర్దారించారు. మానసిక వైకల్యం ఉన్నందువల్లే చిన్నారిని వారు కడతేర్చినట్టు తేల్చారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మల్లారెడ్డి, యాచారం సీఐ కృష్ణంరాజు వివరాలు వెల్లడించారు.

ఒడిశా నుంచి బతుకుదెరువు కోసం..:
ఒడిశాకు చెందిన హేతురాం ఛత్రియ, తులసి దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఇబ్రహీంపట్నం వచ్చారు. ఇదే క్రమంలో నాలుగు నెలల క్రితం యాచారం మండలం తులేకుర్ధు గ్రామంలో ఓ ఇటుకల బట్టీలో కూలీలుగా చేరారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు కాగా.. చిన్న కూతురు ఉర్మిళ(7) మానసిక వైకల్యంతో బాధపడుతోంది.

ఈ నెల 26న హత్య:
కూలీ పనులకు వెళ్లే ఆ తల్లిదండ్రులకు మానసిక వైకల్యం ఉన్న చిన్నారిని చూసుకోవడం కష్టంగా అనిపించింది. దీంతో చిన్నారిని హత్య చేస్తే గొడవ వదిలిపోతుందనుకున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 26న ఇటుకల బట్టీ పక్కన వారు నివాసం ఉంటున్న గుడిసెలోనే చిన్నారిని హతమార్చారు. తల్లి తులసి బండరాళ్లతో చిన్నారి తలపై మోది హత్య చేసింది. సాయంత్రం భర్త ఇంటికి వచ్చాక.. ఇద్దరు కలిసి చిన్నారిని సమీపంలోని బూడిదలో పడేశారు.

ఏమీ తెలియనట్టు..:
చిన్నారిని హత్య చేసిన తల్లిదండ్రులు.. ఆపై ఏమి ఎరుగనట్టు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. మరుసటిరోజు ఇటుకల బట్టీ సమీపంలోని బూడిదలో ఓ చోట ఈగలు విపరీతంగా ముసురుకోవడం బట్టీ కార్మికులు గమనించారు. అందులో నుంచి దుర్వాసన వస్తుండటంతో.. పైపై బూడిదను తొలగించారు. దీంతో అందులో చిన్నారి ఊర్మిళ మృతదేహం కనిపించింది.

ఎట్టకేలకు చేధించారు..:
చిన్నారి మృతదేహం లభ్యమవడంతో.. పోలీసులు డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించారు. ఆ డాగ్ స్క్వాడ్ నేరుగా తులసి దంపతుల ఇంటిలోకే వెళ్లడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఆపై వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. చిన్నారిని తామే హతమార్చామని అంగీకరించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.












Click it and Unblock the Notifications