Vegetables Price: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని ఓ పాట ఉంటుంది. ఈ పాటకు తగ్గట్లుగానే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏ కూరగాయ కొనుగోలు చేయాలన్నా జనం భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఆకు కూరలు భారీగా పెరిగి పోయాయి. పాల కూర కేజీ రూ. 120 చేరింది. కొత్తిమీర కేజీ రూ. 260 చేరింది. పచ్చిమిర్చి కేజీ రూ.180 చేరింది. దీంతో ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలంటేనే భయపడతున్నారు. కేవలం 15 రోజుల్లోనే కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయ ఏదైనా వంద రూపాయలు పలుకుతున్నట్లు చెబుతున్నారు.
కిలో కొనే వారు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. టమాటా ధరలు కూడా భారీగా పెరిగాయి. కూరగాయల ఉత్పత్తి తగ్గడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వానలు బీభత్సం సృష్టించడంతో చాలా చోట్ల కూరగాయ పంటలు నష్టపోయాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా రాకపోవడంతో కేజీ టమాట 60 రూపాయల పైనే పలుకుతోంది. క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ధరలు కూడా భారీగానే ఉన్నాయి.

కిలో బీట్ రూట్ 80 కి పైగా ఉంది. ఉల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో ప్రజలు పచ్చడి, కోడిగుడ్లు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నెల రోజుల పాటు కూరగాయల ధరలు ఇలా ఉంటాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్ కేజీ రూ. 120, నిమ్మకాయ కేజీ రూ. 200, బెండకాయ కేజీ రూ. 100, బీరకాయ కేజీ రూ.140, క్యారెట్ కేజీ రూ. 100, అలుగడ్డ కేజీ రూ. 60, ఉల్లిగడ్డ కేజీ రూ. 60, బీన్స్ కేజీ రూ. 260, సోరకాయ కేజీ రూ. 75, క్యాప్సికమ్ కేజీ రూ. 140, క్యాబేజీ కేజీ రూ.90, బీట్ రూట్ కేజీ రూ. 250, వెల్లుల్లి కేజీ రూ. 500 అల్లం కేజీ రూ. 250 చేరింది.
కూరగాయలతో పాటు పప్పుల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. కంది పప్పు, పెసర పప్పు ధరలు ఎక్కువగా ఉన్నాయి. అటు సన్న బియ్యం ధరలు కూడా ఇప్పటికే పెరిగి పోయాయి. దీంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications