తీరిన మోజు... ఖాళీగా హైదరాబాద్ మెట్రో! చార్జీలు భరించలేక మళ్లీ బస్సుల్లోనే...

Posted By:
Subscribe to Oneindia Telugu
  Hyderabad Metro Down Due To High Ticket Prices

  హైదరాబాద్: నగరవాసుల మెట్రో రైలు మోజు తీరింది. కొత్త మోజులో ప్రయాణికులు మెట్రో రైలులో తిరిగేందుకు ఎక్కువగా ఉబలాటపడినా ఆ తరువాత క్రమంగా తగ్గించేశారు. టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉండడం కూడా ఇందుకు ఒక కారణం.

  దీంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమైన రెండున్నర నెలలకే ఖాళీగా తిరుగుతోంది. ప్రారంభం సమయంలో ప్రయాణికుల తాకిడితో కిటకిటలాడిన మెట్రో స్టేషన్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ప్రయాణికులు తగ్గడంతో ఆ ప్రభావం మెట్రో ఉద్యోగులపైనా పడింది.

  మొదట్లో ప్రయాణికుల కిటకిట...

  మొదట్లో ప్రయాణికుల కిటకిట...

  హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభంలో ప్రయాణికులతో కిటకిటలాడింది. నాగోల్-మియాపూర్ మార్గంలో ఉద్యోగరీత్యా నిత్యం తిరిగే ప్రయాణికులే కాకుండా మెట్రో రైలు, దాని స్టేషన్లు ఎలా ఉంటాయో చూద్దామని కూడా నిత్యం చాలామంది వస్తుండే వారు. ఉబలాటం కొద్దీ పిల్లా పెద్దా రైలెక్కి అటూ ఇటూ తిరిగి తమ మోజు తీర్చుకునే వారు. దీంతో కొన్ని రోజులపాటు ప్రయాణికుల రద్దీతో మెట్రో రైళ్లు అటూ ఇటూ తిరిగాయి.

   మోజు తగ్గింది, స్టేషన్లు వెలవెల...

  మోజు తగ్గింది, స్టేషన్లు వెలవెల...

  ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి తగ్గిపోయింది. సందర్శకులు క్రమంగా తగ్గిపోవడంతో ఇక ఉద్యోగరీత్యా ఆ మార్గంలో ప్రయాణించే వారే మిగిలారు. టిక్కెట్ల ధరలు భరించలేనివిగా ఉండడంతో వీరు కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. దీంతో మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య బాగా పలుచబడింది. ఏ స్టేషన్‌ చూసినా అరకొరగానే ప్రయాణికులు కనిపిస్తున్నారు. ఆ ప్రభావం మెట్రో సిబ్బందిపై పడుతోంది. పెద్ద సంఖ్యలో వారి ఉద్యోగాలపై వేటు పడుతోంది.

  టిక్కెట్ చార్జీలు భరించలేక...

  టిక్కెట్ చార్జీలు భరించలేక...

  మెట్రో ప్రారంభంలో అందులో ప్రయాణించేందుకు అమిత ఉత్సాహం కనబరిచిన ప్రయాణికులు ఇప్పుడు మెట్రో పేరు చెబితే చాలు.. ‘అమ్మో' అంటున్నారు. దీనికి కారణం మెట్రో రైలు టిక్కెట్ చార్జీలు అధికంగా ఉండడమే. దేశంలోని ఇతర మెట్రోలలో లేని విధంగా హైదరాబాద్ మెట్రో రైలులో టిక్కెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో కంటే మన దగ్గర ధరలు ఎక్కువ. బెంగళూరు, చెన్నై, ముంబై, కొచ్చి, జైపూర్‌.. ఇలా ఏ మెట్రో ప్రాజెక్టును తీసుకున్నా వాటికి మించిన ధరలు ఇక్కడ ఉన్నాయి. మెట్రో రైలు ప్రారంభమై మూణ్ణెళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు రోజువారీ, నెలవారీ పాస్‌ల ఊసే ఎత్తడం లేదు. నిత్యం మెట్రోలో ప్రయాణించే వారికి ఇది ఇబ్బందిగా మారింది. దీంతో మెట్రో రైలు కంటే సిటీబస్సు నయం అనుకుని ఎంతో మంది వాటిని ఆశ్రయిస్తున్నారు.

  వాహనాల పార్కింగ్ పెద్ద సమస్య...

  వాహనాల పార్కింగ్ పెద్ద సమస్య...

  మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్య ప్రయాణికులకు పెద్ద తొలనొప్పిగా మారింది. సరైన పార్కింగ్ వసతి లేక ఎక్కడపడితే అక్కడే ద్విచక్రవాహనలను నిలపాల్సి వస్తోంది. ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్ కావడంతో అమీర్‌పేట స్టేషన్‌కు నిత్యం వేల మంది వస్తుంటారు. అక్కడ కూడా సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డుకు ఇరువైపులా తమ వాహనాలను పార్క్‌ చేయాల్సి వస్తోంది. అదే అదనుగా ట్రాఫిక్ పోలీసులు వారిపై తమ జులుం ప్రదర్శిస్తున్నారు. ఇష్టానుసారంగా చలానాలు రాయడం, కొన్నిసార్లు వాహనాలు ఎత్తుకుపోవడం ప్రయాణికులకు సమస్యలుగా మారాయి. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని మెట్రోవైపు చూడడమే మానేస్తున్నారు.

  అదనపు ఆదాయమున్నా...

  అదనపు ఆదాయమున్నా...

  టిక్కెట్ చార్జీలు తగ్గించి ప్రయాణికులను పెంచే విధంగా హైదరాబాద్ మెట్రో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే మెట్రో పిల్లర్లపై ఏర్పాటు చేసిన ప్రకటనల ద్వారా ఆదాయం బాగానే వస్తోంది. ఇక ప్రధాన ప్రాంతాల్లో మెట్రో వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పంజగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్ సిటీ, మలక్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాల్లో 4 మాల్స్ నిర్మించారు. వీటి ద్వారా లక్షలాది రూపాయల ఆదాయాన్ని మెట్రో ఆర్జించనుంది. ఇంత ఆదాయం వస్తున్నా చార్జీల పేరుతో ప్రయాణికులపై అధిక భారం మోపడం, అదనపు రుసుములు వసూలు చేస్తుండడంతో మెట్రోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చార్జీలు తగ్గించకుంటే రైళ్లను ఖాళీగా తిప్పుకోవాల్సిందేనని ప్రయాణికులు అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The number of passengers who are travelling in Hyderabad Metro Rail is gradually decreasing. High Ticket Prices, Parking Problems at Metro Stations are the main reasons for this trend. While passengers are decreasing in one side, on the other side it is effecting the jobs of the metro rail staff. Many employees of HMR lost their jobs recently.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి