డీజిల్, పెట్రోలు షాకింగ్: రూ.7 దాకా పెరగొచ్చు! కారణాలు ఇవే..
అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో పెట్రోలు, డీజీల్ ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశముంది. గురువారం ఈ ధరలు పెరగవచ్చునని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో పెట్రోలు, డీజీల్ ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశముంది. గురువారం ఈ ధరలు పెరగవచ్చునని చెబుతున్నారు.
ఈ రోజు సమావేశం అనంతరం ఆయిల్ కంపెనీలు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నాయి. ధరలు పెరిగితే కనుక.. పెట్రోలు, డీజిల్ ధరలు ఒక లీటరుకు ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు పెరిగే అవకాశముంది.

కారణాలు.. అంతర్జాతీయ మార్కెట్, సరఫరా తగ్గింపు
పదిహేను రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పదిహేను శాతం మేర పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.6 దాకా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి చేసే ఒపెక్ దేశాలతోపాటు రష్యా తదితర దేశాలు కూడా 2001 తర్వాత మళ్లీ ఇప్పుడు సరఫరాలను తగ్గించాలని నిర్ణయించడం ధరల పెరుగుదలకు కారణం.

దిగుమతి
చమురు కంపెనీలు గురువారం భేటీ అయి ధరలను సమీక్షించనున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత ఒకటి. మన దేశంలో వినియోగించే చమురులో ఎనభై శాతాన్ని దిగుమతి చేసుకుంటాం. 2014 జూన్‌లో బ్యారెల్‌కు 115 డాలర్లుగా ఉన్న చమురు ధరలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 డాలర్ల దిగువకు చేరింది.

చమురు దరలు
ఈ రెండేళ్లుగా భారతదేశం ద్రవ్యోల్బణం బారిన పడకుండా కాపాడింది తగ్గిన చమురు ధరలే. అయితే పదిహేను రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఈ పక్షం రోజుల్లో చమురు ధర సగటున 51 డాలర్లుగా ఉంది. అంతకుముందు ఆ సగటు 44.46 డాలర్లుగా ఉండేది. డిసెంబరు 12న బ్యారెల్ చమురు ధర 54.42 డాలర్లకు చేరింది. ఆ తర్వాత దాని శుద్ధికి అయ్యే ఖర్చు, విదేశీ మారకం విలువ వీటన్నిటి మీదా పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారపడి ఉంటాయి.

రెండుసార్లు పెంచొచ్చు
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ఆరు నుంచి ఏడు రూపాయల దాకా పెంచే అవకాశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అయితే, నోట్ల రద్దుతో ప్రజలు ఇప్పటికే కుదేలైనందున ప్రభుత్వం వారిపై ఒకేసారి భారం మోపేందుకు అంగీకరించకపోవచ్చనని అంటున్నారు. మొత్తం భారాన్ని రెండు విడతలుగా వేయవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications