తెలంగాణలో బీజేపీని ఆదరిస్తున్నారు - హుజూరాబాద్ ఫలితమే నిదర్శనం : ప్రధాని మోదీ..!!
తెలంగాణలో తాజాగా హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపు పైన ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన తెలంగాణలో రాజకీయాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని...తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనంగా వ్యాఖ్యానించారు. 2018లో..ఇప్పుడూ హుజూరాబాద్ లో బీజేపీకి వచ్చిన ఓట్లను ప్రధాని వివరించారు. దేశంలో ప్రజలు మార్పులను కోరుతున్నారనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం
తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోందన్నారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యే సీటును గెలుచుకున్నామని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామన్నారు. హుజూరాబాద్‌లో ఘన విజయంతో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని అర్థమవుతోంది'' అని ఆయన అన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని పునరుద్ఘాటించిన ప్రధాని మోదీ.. పరోక్షంగా కాంగ్రెస్ ను విమర్శించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్‌లలో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.

తెలంగాణ పైన నేతల ప్రస్తావన
సామాన్య ప్రజలకు, పార్టీకి నడుమ వారధిగా కార్యకర్తలు నిలబడాలని సూచించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తన ప్రారంభోపన్యాసంలో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీ కష్టించి పనిచేస్తుంటే.. దానిని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. కార్యవర్గం భేటీ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. మహిళా సారథ్య అభివృద్ధే తమ లక్ష్యమని ప్రకటించారు. బీజేపీ చేయాల్సిన మంచి చాలా ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

అయిదు రాష్ట్రాలపై రాజకీయ చర్చ
ఎన్నికల వేళ పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. దేశంలోని 10.40 లక్షల పోలింగ్ కేంద్రాలన్నిటిలో ఈ ఏడాది డిసెంబరు 25వ తేదీ నాటికి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కార్యవర్గ సభ్యులతో పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చర్చలు జరిపారు. తమ తమ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై అక్కడి సీఎంలు, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

అదే సమయంలో కేసీఆర్ ఫైర్
ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం..తెలంగాణ బీజేపీ నేతల పైన మండిపడ్డారు. అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. పెట్రోలు..డీజిల్ ధరల విషయంలో కేంద్రం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేంద్రంతో ఇప్పటి వరకు సంయమనంతో ఉన్నామని..ఇక, పోరాటం చేస్తామని చెప్పారు. ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు తమను వ్యక్తిగతంగా దూషించినా క్షమించామని చెబుతూ..ఇక, నుంచి ఆ పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు.
Recommended Video

అగ్గి పుట్టిస్తామంటూ ఆగ్రహం
హుజూరాబాద్ లో ఓటమి ని కేసీఆర్ లైట్ తీసుకున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని..ఆ ఎన్నికలో ఓడితే తెలంగాణ మొత్తం తమ పైన వ్యతిరేకత ఉందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిందని..దేశం మొత్తం బీజేపీకి వ్యతిరేకత ఉందని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రతీ సారి అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications