ప్రధాని మోడీ విజయ సంకల్ప సభ: కదం తొక్కిన కాషాయదళం.. ఓరుగల్లులో ట్రాఫిక్ జామ్!!
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు తెలంగాణా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తుంది. నేడు 30 ఏళ్ళ తర్వాత భారత ప్రధాని వరంగల్ కు రావటంతో ఓరుగల్లు కాషాయవర్ణంగా మారింది. కాషాయ దండు మోడీ పర్యటనతో సంబరాల్లో ఉంది.
నేడు వరంగల్‌లో జరగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభకు జనం భారీగా తరలివస్తున్నారు. భారత ప్రధాని మోడీ ఈ విజయ సంకల్ప సభలో మాట్లాడనున్న నేపధ్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం అంతా బీజేపీ శ్రేణులతో నిండిపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి భారీగా బీజేపీ నేతలు, శ్రేణులు ప్రధాని సభకు చేరుకున్నారు. సభా వేదికపై మోడీ ఏం చెప్తారో అన్న ఆసక్తి నేపధ్యంలో అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఈ రోజు వరంగల్ కు రాష్ట్ర వ్యాపతంగా ఉన్న నేతలు పోటెత్తటంతో పాటు, ప్రధాని పర్యటన నేపధ్యంలో విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వాహనాలు వస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద భారీగా వాహనాలు చేరుకోవటం ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తుంది.
కాసేపట్లోనే ప్రధాని మోదీ సభా వేదికపైకి వచ్చి ప్రసంగించనున్నారు. నేడు ఆయన అధికారిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ వరంగల్ ఎన్ హెచ్ 563 నాలుగు లేన్ల అభివృద్ధి పనులను, ఎన్ హెచ్ 163 జి మంచిర్యాల నుండి వరంగల్ జాతీయ రహదారి నాలుగులేన్ల ఏసీ న్యూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు నార్వా నుండి పుట్టపాక, పుట్టపాక నుండి పంగిడిపల్లికి, పంగిడిపల్లి నుండి ఊరుగొండ కు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఆపై రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేట కు శంకుస్థాపన చేయనున్నారు. ఆపై విజయ సంకల్ప సభలో ఏం మాట్లాడతారు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.












Click it and Unblock the Notifications