తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు: ఆ రోజే వరంగల్‌కు, కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణలో అధికారం చేపట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ కుటుంబం పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ జులై 8న తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అదేరోజు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‍లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.

ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్లో మాట్లాడారు. శంకుస్థాపన అనంతరం స్థానికంగా బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాని మోడీ ఈ సభలో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ కుటుంబంపై నేరుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యాలని.. మీ పిల్లలు బాగుండాలంటే బీజేపీకి ఓటేయ్యాలంటూ తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాగా, గతంలో ఏప్రిల్‌లో తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ రూ.11,300 కోట్లుకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభించిన విషయం తెలిసిందే. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తోపాటు రైల్వేలు, రోడ్డు కనెక్టివిటీ, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాలను కలిగి ఉన్నాయి. తాజాగా జరగనున్న పర్యటనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంపై వివరించే అవకాశం ఉంది. అలాగే, బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications