ఆదిలాబాద్ జిల్లాలో కలకలం.. 30 మంది విద్యార్ధులపై విషప్రయోగం
ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. స్కూల్ తాగునీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలపడం తీవ్ర కలకలంగా మారింది. అంతే కాకుండా మధ్యాహ్న భోజనం సామాగ్రిపై కూడా విషయం చల్లారు. అయితే సిబ్బంది అప్రమత్తతతో ఈ పెను ప్రమాదం తప్పి 30 చిన్నారుల ప్రాణాలకు ముప్పు తప్పింది. దీంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఏం జరిగిందంటే...
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ పాఠశాలకు గత శనివారం, ఆదివారం సెలవుల నేపథ్యంలో.. సిబ్బంది వంట గదికి తాళం వేసి ఇంటికెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసే ముందు పాత్రలు కడుగుతుండగా వాటిలోంచి చెడు వాసనతో పాటు నురుగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ గమనించగా, అక్కడ పురుగుల మందు డబ్బా కనబడింది. వెంటనే తాగు నీటి ట్యాంక్‌ను పరిశీలించగా, అందులోనూ అదే విషాన్ని కలిపినట్లు గుర్తించారు.

ఈ విషయాన్ని స్కూల్ టీచర్లకు తెలియజేయగా.. వెంటనే స్పందించిన సిబ్బంది విద్యార్థులను నీటి కుళాయిల వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజనం వండడం పూర్తిగా నిలిపివేసి ఏ ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పాఠశాల హెచ్‌ఎం ప్రతిభ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు చెబుతున్నారు. ఇంతటి దురాగతానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications