వాట్సప్‌తో తప్పిపోయిన బాలుడ్ని కనుగొన్నారు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో నివాసముండే బంధువుల ఇంటికి వచ్చి తప్పిపోయిన ఓ బాలుడిని సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్‌బుక్‌ల సాయంతో పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..జార్ఖండ్‌కు చెందిన రూపేష్(14) తన తల్లిదండ్రులతో కలిసి సికింద్రాబాద్‌లో నివసిస్తున్నాడు.
ఇటీవలే నగరానికి వచ్చిన ఈ బాలుడు ఇతర కుటుంబసభ్యులతో కలిసి తిరుమలగిరిలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం రాత్రి ఓ దేవాలయానికి వెళ్లిన రూపేష్ కుటుంబసభ్యుల నుంచి తప్పిపోయాడు. చిరునామా సరిగా తెలియకపోవడంతో పాటు బోజ్‌పురి తప్ప ఇతర భాష కూడా రాని అతను రెండు,మూడు బస్సులు మారి చివరకు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్దకు చేరుకున్నాడు.

బాలుడిని గమనించిన పోలీసులు ఆరా తీశారు. అతని వివరాలను పోలీసు విభాగానికి సంబంధించిన వాట్సప్, ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టును తిరుమలగిరి పీఎస్ పోలీసులు గమనించారు. అప్పటికే అక్కడ బాలుడి తండ్రి కిరణ్ ఫిర్యాదు చేశాడు.
ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా సమాచారం తెలుసుకున్న అక్కడి పోలీసులు విషయాన్ని బాలుడి తండ్రికి తెలిపారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న కిరణ్ తన కొడుకును తీసుకెళ్లాడు. తన కుమారుడి ఆచూకీని కనిపెట్టడంలో సాయపడిన పోలీసులతోపాటు, సహాయకారిగా నిలిచిన వాట్సప్, ఫేస్‌బుక్‌లకు బాలుడి తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications