బ్యుటిషియన్ శిరీష కేసు ఏమైంది?: పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారా?..
హైదరాబాద్: సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసు దర్యాప్తుపై ఆమె కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, ఇప్పటికీ కేసులో చార్జిషీట్ ఎందుకు దాఖలవ్వలేదు? అని ప్రశ్నిస్తున్నారు.
సంఘటన స్థలంలో శిరీష ఒంటిపై ఉన్న దుస్తులతో పాటు, అక్కడ సేకరించిన కొన్ని వస్తువులు దర్యాప్తుకు కీలకంగా మారాయి. దీంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేయడానికి ఫోరెన్సిక్ రిపోర్టే కీలకం. అయితే ఆర్నెళ్లు గడిచినా ఇంతవరకు ఫోరెన్సిక్ రిపోర్ట్ రానే లేదు.

ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే తప్ప చార్జీషీట్ వేయలేమని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై శిరీష కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, హైదరాబాద్‌కు చెందిన శిరీషకు సతీశ్‌చంద్రతో తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఓ పాప ఉంది. తొలుత బ్యుటీషియన్ గా పనిచేసిన శిరీష.. ఆ తర్వాత రాజీవ్ ఫోటో స్టూడియోలో చేరింది. ఆ తర్వాత రాజీవ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. రాజీవ్ మరో అమ్మాయిని ప్రేమించడంతో శిరీషకు అతనికి మధ్య విభేదాలు వచ్చాయి.
ఇదే క్రమంలో.. ఓరోజు రాజీవ్, అతని స్నేహితుడు శ్రవణ్ శిరీషను తీసుకుని కుకునూర్ పల్లికి వెళ్లారు. అక్కడ కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషపై అత్యాచారానికి యత్నించాడన్న ఆరోపణలున్నాయి. శిరీష గట్టిగా ప్రతిఘటించడంతో ఆమెను తీసుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరారు.
హైదరాబాద్ చేరుకోగానే శిరీష ఫ్లాట్‌లోకి వెళ్ళి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరుసటిరోజే ప్రభాకర్ రెడ్డి కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఈ రెండింటి లింకులు బయటపడ్డాయి. మనస్తాపంతో శిరీష, పరువు పోతుందని ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. అయితే కుకునూర్ పల్లి వెళ్లాక.. ఆరోజు రాత్రి అక్కడేం జరిగిందన్న దానిపై కచ్చితమైన ఆధారాలు మాత్రం సంపాదించలేకపోయారు పోలీసులు.












Click it and Unblock the Notifications