మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేంద్రమంత్రి సంచలనం!
కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రలో భాగంగా దొంగఓట్లతో బీజేపీ నేతలు గెలిచారు అంటూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి, దొంగఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు వెళదామా? అంటూ ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెసోళ్లు కన్పిస్తే రాళ్లతో కొట్టేంత కోపంతో ప్రజలున్నారు: బండి సంజయ్
పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల 25 వేల భారీ మెజారిటీతో గెలిపిస్తే దొంగ ఓట్లు కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తుంటే కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.అయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేదని, కాంగ్రెసోళ్లు కన్పిస్తే రాళ్లతో కొట్టేంత కోపంతో ప్రజలున్నారని బండి సంజయ్ అన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు.

లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళేది అందుకే
20 నెలల పాలనలో పంచాయతీలకు పైసలియ్యని ఏకైక పార్టీ కాంగ్రెస్సే అని తేల్చి చెప్పారు. పంచాయతీలకు నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే అని పేర్కొన్న బండి సంజయ్ కేంద్ర నిధుల కోసమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని అన్నారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని మహేశ్ కుమార్ గౌడ్ కు దొంగ ఓట్ల గురించి ఏం తెలుసు? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
మహేష్ గౌడ్ ఒక గజినీ
మహేశ్ గౌడ్ ను చూస్తే గజినీ సినిమా గుర్తుకొస్తుంది అని, గతంలో తనను బీసీ అన్నది ఆయనే, ఇప్పుడు దేశ్ ముఖ్ అని అంటున్నది ఆయనే అని పేర్కొన్నారు. బీసీ వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెడితే ఓడగొట్టాలని చూస్తోంది కాంగ్రెస్సే అని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలొస్తే టోపీలు పెట్టుకుని మసీదుల్లో ప్రార్ధనలు చేస్తూ ఓట్లడిగే బిచ్చగాళ్లు మీరేనని కాంగ్రెస్ నాయకులను బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలోనూ హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తా
ఎన్నికలున్నా లేకున్నా హిందూ సమాజం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడే పార్టీ బీజేపీ అని ఆయన స్పష్టం చేశారు. నేను హిందూ ఓటు బ్యాంకుతోనే కరీంనగర్ లో భారీ మెజారిటీతో గెలిచానన్నారు. తెలంగాణలోనూ హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తా అని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర హోం బాధ్యతలు చూస్తున్న బండి సంజయ్ రోహింగ్యాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపైన ఆయన మండిపడ్డారు.
రోహింగ్యాలంతా 2014కు పూర్వం వలస వచ్చిన వాళ్లే
తెలంగాణలోకి వచ్చిన రోహింగ్యాలంతా 2014కు పూర్వం వలస వచ్చిన వాళ్లేనని బండి సంజయ్ అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులిచ్చి ఓటు బ్యాంకు కోసం చూస్తోంది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. వాస్తవాలు తెలియకుండా మాట్లాడే మూర్ఖులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని బండి సంజయ్ అన్నారు.












Click it and Unblock the Notifications