కేసీఆర్ ఫాంహౌస్ కలలు!
కాంగ్రెస్ సర్కారుపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కేసీఆర్ ఫాంహౌస్ కలలు మానుకోవాలని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్‌లో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థ్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తెలంగాణ ప్రజలు ఫాంహౌస్ పాలన, గడీల పాలన కోరుకోవడం లేదన్నారు మహేశ్ కుమార్ గౌడ్. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నారని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలోనే సాధించడంతో ఆయన దిక్కుతోచక ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు వస్తుండటంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్.. కాంగ్రెస్ అధికారంలో విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం కనిపించడం లేదా? అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదించినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా గుణపాఠం నేర్వకుండా.. కేసీఆర్ ఫాంహౌస్‌లో పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని అన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? లేక..
కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామన్నారు. ఫాంహౌస్‌లో ఉండే మాట్లాడతారా..? లేక అసెంబ్లీకి వస్తారా? అని ప్రశ్నించారు. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కూడా కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుంభకర్ణుడిలా ఏడాదిగా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications