పొన్నాల లక్ష్మయ్య మెడలో గులాబీ కండువా..!!
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజున వెలువడుతుంది. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. అభ్యర్థులకు బీఫామ్‌లను అందజేశారు.
జనగామలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తోన్నారు కేసీఆర్. ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రస్తావించారు. ధరణి పోర్టల్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై వివరించారు. స్వపరిపాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోగలిగామని పేర్కొన్నారు. వేగంగా పురోగమిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
ఈ సభ వేదికగా- తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. బీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువాను ఆయన మెడలో వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. పొన్నాల అనుచరులు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడారు. 45 సంవత్సరాల సుదీర్ఘకాలం తాను కాంగ్రెస్‌లో పని చేశానని, ఎన్నో అవమానాలకు గురి అయ్యానని అన్నారు. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను చాలాసార్లు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఉపయోగం లేదని చెప్పారు.

బీఆర్ఎస్‌లో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలకు సమ ప్రాధాన్యత లభిస్తోందని, అందుకే ఈ పార్టీలో చేరానని వివరించారు పొన్నాల లక్ష్మయ్య. అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే తెలంగాణ వ్యాప్తంగా సకల జనుల సర్వే చేసిన ఘనత కేసీఆర్‌కు ఉందని ప్రశంసించారు. మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications