అప్రకటిత కరెంట్ కోతలు.. ముఖ్యమంత్రి గారూ.. జరా చూడరూ!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కోతలు పెరుగుతాయని బిఆర్ఎస్ నాయకులు నాడు చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తున్నట్లుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కరెంటు కోత కొనసాగుతుంది.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు
అసలు కరెంటు కోతకు గల కారణం ఏమిటి? ప్రభుత్వం నిరంతరాయ విద్యుత్ సరఫరా జరపాలని చెబుతున్నప్పటికీ అప్రకటిత విద్యుత్తు కోతలు ఎందుకు కొనసాగుతున్నాయి? అన్నది ప్రస్తుతం ప్రతిఒక్కరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఇటీవలకాలంలో ఉదయం సమయంలో నిత్యం పవర్ కట్ కొనసాగుతుంది. ఇక మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాలలో పవర్ కట్ నిత్యకృతంగా మారిందని ప్రజల నుంచి అసహనం వ్యక్తం అవుతుంది.

కాంగ్రెస్ పాలనలో ఏమిటీ కరెంట్ కోతలు
ఇక హైదరాబాద్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో చిన్న వర్షం పడితే చాలు కరెంట్ పోతుంది. ఇక ఈ పరిస్థితులు సామాన్య మధ్య తరగతి ప్రజలకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కరెంటు కోతల నేపథ్యంలో ఐదేళ్ల కాంగ్రెస్ పాలన పైన పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పాలనా పగ్గాలు చేపట్టి పట్టుమని సంవత్సరం కూడా కాకముందే ఈ కరెంటు కోతలు ఏమిటి అన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న.
ప్రభుత్వం చెప్తున్న దానికి, వాస్తవ పరిస్థితికి చాలా తేడా
ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం పదేపదే చెబుతున్న కరెంటు కోతలు ఎందుకు కొనసాగుతున్నాయి అన్నది మాత్రం అంతు పట్టకుండా ఉంది . సరిపడా కరెంటు ఉన్నప్పటికీ, అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరాను చేయడంలో విద్యుత్ శాఖ విఫలమవుతుందా? నిర్వహణలోపం వల్లే పదేపదే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయా? దీనిని ప్రభుత్వం సరిగా మానిటర్ చేయలేకపోతుందా? అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గ్రేటర్ హైదరాబాద్ లో పవర్ కట్ పై ప్రజల ఆగ్రహం
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో అయితే కరెంటు సమస్యల పైన సోషల్ మీడియాలో ప్రజలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కరెంటు పోవడం రొటీన్ గా మారిందని మండిపడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కష్టమని చెబుతున్నారు. హైదరాబాద్లోని 10 ఆపరేషన్స్ సర్కిళ్లలో నిత్యం ఎక్కడ ఒకచోట విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఫిర్యాదుల పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువగా మారుతున్నాయి.
విద్యుత్ కోతలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని విజ్ఞప్తి
ఇటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతల పైన ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ విద్యుత్ కోతల పైన దృష్టి సారించాలని నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను నిజం చేసినట్టు అవుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications