కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్.. భట్టికి కేటాయింపు
Bhatti Vikramarka: ప్రగతి భవన్. హైదరాబాద్ బేగంపేట్‌లో ఉండే సువిశాల భవంతి. మొన్నటివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఎక్కువశాతం అధికారిక సమీక్షలను ఇక్కడే నిర్వహించే వారాయన. మంత్రులు, అధికారుల రాకపోకలతో కళకళలాడుతుండేది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార మార్పిడి చోటు చేసుకోవడం వల్ల ఈ భవానన్ని కేసీఆర్ ఖాళీ చేయాల్సి వచ్చింది. దీని ముందు ఉన్న ఇనుప బ్యారికేడ్లు, గేట్లన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాటన్నింటినీ తీసివేశారు. దీని తరువాత పెద్ద సంఖ్యలో దీన్ని సందర్శించడానికి స్థానికులు వచ్చేవారు.

అధికారంలోకి వచ్చిన తొలి రోజే.. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజా భవన్‌గా మార్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రగతి భవన్‌ను ప్రజా వాణి కోసం వినియోగించుకుంటోంది. కొండా సురేఖ సహా కొందరు మంత్రులు ప్రజా వాణి కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహిస్తోన్నారు. ముఖాముఖిగా ప్రజలను కలుసుకుంటోన్నారు. వారి నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరిస్తోన్నారు.
దీనిపై రేవంత్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ప్రజా భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించింది. ఇకపై ఇది- భట్టి విక్రమార్క అధికారిక నివాసం కానుంది. త్వరలోనే ఆయన ఇక్కడికి షిఫ్ట్ కానున్నారు. అధికారిక కార్యక్రమాలన్నింటినీ ఇక్కడి నుంచే కొనసాగించనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొద్దిసేపటి కిందటే జీవో నంబర్ 1638ను జారీ చేశారు. ఈ భవనం ప్రస్తుతం రోడ్లు- భవనాల మంత్రిత్వ శాఖ అధికారుల ఆధీనంలో ఉంది. దీన్ని భట్టి విక్రమార్కకు హ్యాండోవర్ చేయాలని శాంతికుమారి ఆదేశించారు.












Click it and Unblock the Notifications