ప్రజాపాలన సదస్సు పొడిగింపు ఉండదు: తేల్చేసిన మంత్రి పొన్నం, కేసీఆర్ బినామీ కిషన్ అంటూ
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాపాలన సదస్సుల పొడిగింపు ఉండదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సచివాలయంలోని మీడియా సెంటర్ వద్ద మంత్రి పొన్నం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు పొన్నం. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి బినామీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న అవగాహన అందరికీ తెలుసని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్టునే కిషన్ రెడ్డి చదివారని విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ ఎన్నోసార్లు అవమానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ ఇప్పటి వరకు తమ పార్టీ శాసనసభపక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయిందని మండిపడ్డారు. మేడిగడ్డపై కేంద్రం.. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణకు కేంద్ర నిధులు రాలేదన్నారు. రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని పొన్నం కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం అని బీజేపీ నేతలే విమర్శించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని బీజేపీ నేతలే అన్నారు కదా అని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం, లిక్కర్ స్కాంలో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు.
ప్రజా పాలనకు విశేష స్పందన: అప్పుడే విమర్శలా అంటూ పొన్నం ఫైర్
రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి విజయ్‌నగర్ కాలనీలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించే కార్యాలయాన్ని సందర్శించారు. మూడు రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన కోసం 8.5 లక్షలు, ఇతర దరఖాస్తులు లక్ష పైగా వచ్చాయన్నారు. అన్ని పథకాలకు కలిపి ఒకటే అప్లికేషన్ ఉందని మంత్రి వివరించారు. దరఖాస్తులను ఎక్కడుంటే అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు అని గుర్తు చేశారు. గ్యారంటీలకే కాకుండా ఇతర ఏ సమస్యల కోసమైనా దరఖాస్తు చేయవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం 30 రోజులు అవ్వకుండానే ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి, అప్పులు చేసి వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభ్వుతం లక్షల కోట్ల అప్పును ఇప్పుడు భర్తీ చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పథకాలను అమలు చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications