బియ్యం నుండి కూరగాయల దాకా నిత్యావసరాల ధరల మంట!
తెలంగాణలో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులకు పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వంటింటి నిత్యావసరాల ధరలు వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. బియ్యం నుంచి కూరగాయలు, చక్కెర, బెల్లం వరకు ప్రతి వస్తువు ధరలు గణనీయంగా పెరిగి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి.
బాగా పెరిగిన సన్నబియ్యం ధరలు
మేలు రకం సన్నబియ్యం ధరలు రెండు నెలల క్రితం కిలో రూ.50-52 ఉండగా ప్రస్తుతం రూ.63-70కి చేరుకున్నాయి. నాణ్యత కూడా తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. వానాకాలం పంట బియ్యంతో యాసంగి పంటను కలపడం వల్ల నూకలశాతం పెరుగుతోంది. బహిరంగ మార్కెట్లో సన్నరకాల ధాన్యం లభ్యత తగ్గడం, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరగడం, సరఫరా ఒత్తిడి ధరల పెరుగుదలకు కారణాలుగా మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఉల్లిగడ్డ, వెల్లుల్లి, ఎండుమిర్చి ధరల పెంపు
పౌరసరఫరాల సంస్థ వద్ద అధిక స్టాక్ ఉన్నా వేలం ప్రక్రియకు స్పందన లేకపోవడం మరో కారణంగా తెలుస్తుంది. ఇక కూరగాయల్లో ఉల్లిగడ్డ నెలరోజుల్లోనే దాదాపు రెట్టింపైంది. జూలై చివరి వారంలో కిలో రూ.22-26 ఉంటే ఇప్పుడు రూ.45-52కి చేరింది. వెల్లుల్లి ధర జూన్ మొదటి వారంతో పోలిస్తే రూ.120-130 నుంచి రూ.250 వరకు దాదాపు 100శాతం పెరిగింది. ఎండుమిర్చి రూ.240 నుంచి రూ.300కి, కార్పొరేట్ స్టోర్లలో రూ.360 వరకు పలుకుతోంది.
కూరగాయల ధరలు ఇలా
క్యారెట్ రూ.60-70, బీన్స్ రూ.100-110, చిక్కుడు రూ.80, మోరంగడ్డ రూ.25-33 నుంచి రూ.60కి, పచ్చిమిర్చి రూ.45-55కి చేరాయి. వంట నూనెలు కిలోకు రూ.4-5 పెరిగాయి.చక్కెర ధర ఆరేడు వారాల్లో రూ.42-44 నుంచి రూ.60-65కి సుమారు 50 శాతం, బెల్లం రూ.55 నుంచి రూ.70-75కి పెరిగింది. పండగలు, శుభకార్యాలు, బోనాలు నేపథ్యంలో పూల ధరలు మూరకు రూ.20-25 నుంచి రూ.50-60 వరకు పెరిగి అదనపు భారం మోపుతున్నాయి.
ఇంటి నిత్యావసరాల ఖర్చు భరించలేని స్థితికి వినియోగదారులు
ఈ ధరల పెరుగుదలతో ఇంటి నిత్యావసరాల ఖర్చు భరించలేని స్థితికి వినియోగదారులు చేరుకుంటున్నారు. ధరలను నియంత్రించాలని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాన్య , మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు.













Click it and Unblock the Notifications