యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్!
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర ప్రజలకు శుభ వార్త చెప్పారు. చిన్నారుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) తొలి దశలో బాలికలకు ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై జరిగిన సమీక్షలో రాబోయే మూడేళ్లలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలురు, బాలికల కోసం ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.
యంగ్ ఇండియా స్కూల్స్ మొదటి దశలో బాలికలకు అవకాశం
ప్రస్తుత దశలో బాలికల కోసం పాఠశాలలు కేటాయించిన నియోజకవర్గాల్లో స్కూల్స్ నిర్మాణాలు పూర్తి చేసి మొదటి దశలో బాలికలకు అవకాశం ఇవ్వాలన్నారు. తదుపరి దశలో బాలుర పాఠశాలలను చేపట్టాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ లలో పీఎం కుసుమ్ పథకం క్రింద సోలార్ కిచెన్ ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం
ఈ స్కూల్స్ నిర్మాణ పనుల బిల్లులను కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా క్రమం తప్పకుండా విడుదల చెయ్యాలని సూచించారు. అంతేకాదు ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలవుతున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
అక్షయపాత్ర విజ్ఞప్తికి సీఎం సానుకూల స్పందన
అయితే ఈ సందర్భంగా అక్షయ పాత్ర సంస్థ ప్రతినిధులు, తగిన భూమి, ప్రభుత్వ సహకారం లభిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయవచ్చని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం, ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక కేంద్ర వంటశాల ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు జిల్లా కలెక్టర్లతో సంప్రదించి, 2ఎకరాల భూమి కేటాయింపు లేదా 99ఏళ్ల లీజుపై భూమి కేటాయింపుపై త్వరిత నిర్ణయం తీసుకోవాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో 23 కొత్త పాఠశాలలు వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణంలో ఉన్న 23కొత్త పాఠశాల భవనాలను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.బాచుపల్లి పాఠశాల స్థలం కేవలం అరఎకరం మాత్రమే ఉన్న నేపథ్యంలో, పాఠశాల భవనాలకు కనీసం ఒకటిన్నర ఎకరాల భూమి ఉండేలా చూడాలన్నారు. ప్రస్తుత స్థలం సమీపంలో అదనంగా ఒకటిన్నర ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 1వతరగతి నుంచి 10వతరగతి వరకు పాఠ్యప్రణాళిక సవరణ చెయ్యాలని సూచించారు.
చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, పాలిటెక్నిక్, స్కిల్స్ యూనివర్సిటీపై కీలక ఆదేశం
అలాగే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త కోర్సుల ప్రవేశానికి టాటా టెక్నాలజీస్‌తో కుదిరిన ఒప్పందాన్ని కూడా వేగంగా అమలు చేయాలని సీఎం సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉపాధి లభించేలా పాఠ్యప్రణాళిక, బోధనా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications