ప్రజలకు సేవ చేసే ఆలోచన బీఆర్ఎస్ కు లేదు: ప్రియాంకా గాంధీ
బి ఆర్ యస్ పార్టీ పోలింగ్ జిమ్మిక్కులు చేస్తుందని, తాము అధికార పార్టీకి అమ్ముడుపోయే వారము కాదని ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ జాతీయ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. భువనగిరి, కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. గత 10 ఏళ్ళలో ప్రజలు రోజు రోజుకు పేదలవ్వగా, బి ఆర్ యస్ పార్టీ మాత్రం అందినంత దోచుకుందని విమర్శించారు.
తెలంగాణా ప్రజలకు సేవ చేసే ఆలోచన కేసీఆర్ కు లేదని అన్నారు. ఉద్యమకారుల పోరాటం వల్ల తెలంగాణా వచ్చిందని, కేసీఆర్ వల్ల కాదని, తెలంగాణా ప్రజల ఆలోచనలను, త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణా ఇచ్చారని అన్నారు. అలాగే 10 ఏళ్ళలో బిజెపి ప్రపంచంలోనే అతి పెద్ద సంపన్న పార్టీగా అవతరించిందని బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపద దోచి పెట్టిందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 ఏళ్ళలో 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని అన్నారు. బి ఆర్ యస్ అధికారంలోకి తిరిగి వస్తే దొరల పాలన, లిక్కర్ మాఫియా వీర విహారం చేస్తాయని ప్రియాంకా గాంధీ హెచ్చరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించవని, ప్రశ్నాపత్రాల లీకేజీ కొనసాగుతుందని, అవినీతి పెరుగుతుందని ప్రియాంకా గాంధీ అన్నారు. అనేక మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆమె అన్నారు.
యువత ఆకాంక్షలను బి ఆర్ యస్ ప్రభుత్వం నేరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు ఆశించే హామీలు అన్నీ నేరవేరుస్తామని ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి పదేళ్ళు అయ్యిందని, పదేళ్లుగా కేసీఆర్ పనితీరు కాంగ్రెస్ గమనిస్తూనే ఉందన్నారు.
రైతుల అప్పులు మాఫీ చెయ్యటానికి మోడీ దగ్గర డబ్బులు ఉండవు కానీ మోడీకి రెండు విమానాలు కొనటానికి డబ్బులు ఉంటాయని ఆరోపించారు. ప్రజలకు సేవ చెయ్యటం తమకు తెలిసిన ధర్మం అన్నారు. దొరల తెలంగాణా రోజురోజుకీ బలపడుతుందని, దొరల పాలన నుండి తెలంగాణాకు విముక్తి కల్పించాలని అన్నారు.












Click it and Unblock the Notifications