ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు: వర్చువల్‌గానే ఆ రెండు పథకాల ప్రారంభం
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ యథాతథంగా మంగళవారం(ఫిబ్రవరి 27న) చేవెళ్లలో గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్(200 యూనిట్లు) పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే, ఈ రెండు పథకాలను ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రియాంక ప్రారంభించేలా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక చేతుల మీదుగా రెండు గ్యారెంటీల పథకాలను ప్రారంభించాలని ఫిబ్రవరి 23న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇది ఇలావుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన క్రమంలో.. సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారినీ మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.
ఆ తర్వాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఇందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.955 ఉంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్రం రాయితీ రూ.40 పోనూ మిగతా రూ.415ను రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని తెలుస్తోంది. కాగా, ఉజ్వలకు సంబంధించి సిలిండర్ ధర రూ. 970 ఉందనుకుంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.340 పోగా, మిగతా 130ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా జమ చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications