Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Prof.GN Saibaba:దశాబ్దకాలం జైలులో..ఖైదీలను ఎలా చూస్తారంటే..!!

Prof.GN Saibaba:ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఎట్టకేలకు విడుదలయ్యారు. 2014లో మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సాయిబాబా అరెస్టయ్యారు. ఇక అప్పటి నుంచి జైల్లో ఉన్నారు.బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ అక్రమంగా అరెస్టు చేసి దాదాపుగా దశాబ్దకాలం పాటు చీకటి గదిలో ఉంచారని ప్రభుత్వంపై విమర్శలున్నాయి.

సాయిబాబా విడుదలయ్యాక దశాబ్దకాలం పాటు తాను జైలులో గడిపిన కాలం, అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. జైలులోకి అడుగుపెట్టగానే ముందుగా కులం గురించి ఆరా తీస్తారని చెప్పిన ప్రొఫెసర్.. ఆ తర్వాత కులం ఆధారంగానే ఫలానా ఖైదీకి మర్యాదలు ఉంటాయని చెప్పారు. ఆ ఖైదీ కులాన్ని బట్టి ఎవరు అతనికి భోజనం తయారు చేయాలి, ఎవరు వడ్డించాలి, ఇంకా ఎవరు ఏమి చేయాలనేది డిసైడ్ అవుతుందని వివరించారు.

Professor GN Saibaba Exposes Caste Discrimination in Jail Work Assignments

జైలు నిబంధనల ప్రకారం ఖైదీలు ఏ కులానికి చెందితే ఆ కులవృత్తులను అప్పగించాలని ఉందని.. కానీ ఇది అస్సలు అమలు కావడం లేదని సాయిబాబా చెప్పారు. అక్కడ కుల వ్యవస్థను చాలా కచ్చితంగా పాటిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది ఖైదీలు వెనకబడిన వర్గాలకు, అణగారిన వర్గాలకు చెందిన వారున్నారని చెప్పిన సాయిబాబా... అత్యున్నత వర్గాలకు చెందిన వారు అసలు నేరమే చేయరా అనేది తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. జైలులో మగ్గుతున్న ఖైదీల్లో చాలామంది ఎలాంటి నేరం చేయకుండా వచ్చారు. అదే సమయంలో మరొకరు చేసిన నేరం తమపై మోపడంతో ఇంకొందరు జైలు జీవితం గడుపుతున్నారని చెప్పారు. అమాయకులుగా జైలులో అడుగుపెట్టి చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఆ తర్వాత క్రిమినల్స్‌గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ సాయిబాబా. క్రిమినల్స్ రిక్రూట్‌మెంట్ కేంద్రంగా జైళ్లు తయారయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జైల్లో ఖైదీలను హీనంగా చూస్తారు

పదేళ్ల పాటు జైల్లో నరకాన్ని చూసిన ప్రొఫెసర్ సాయిబాబా తన అనుభవాన్ని పంచుకున్నారు. జైల్లో ఖైదీలను పశువుల కంటే హీనంగా పురుగును చూసినట్లు చూస్తారని చెప్పారు.మనిషి ప్రాణాలకు అసలు విలువే లేదన్నట్లుగా అక్కడి అధికారులు వ్యవహరిస్తారని గుర్తు చేశారు.తను ఉన్న గదిలో కనీసం వీల్‌ ఛైర్‌ కూడా అటూ ఇటూ తిరగదని అత్యంత దారుణమైన చీకటి గదిలో తనను పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాహమైనప్పుడు కనీసం గ్లాసు మంచి నీళ్లు కూడా దొరికేవి కాదని, తన కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన మెడిసిన్స్ కూడా ఇచ్చేవారు కాదని మండిపడ్డారు. తనకు చికిత్స అందించాలని కోర్టు ఆదేశాలున్నప్పటికీ డాక్టర్లను జైలు అధికారులు అనుమతించేవారు కాదని చెప్పారు. ప్రాణాలతో ఎంత కాలం ఉంటావో ఉండు అంతే తప్ప చికిత్స అందించేది లేదు అన్నట్లుగా అధికారులు వ్యవహరించేవారని సాయిబాబా గుర్తు చేసుకున్నారు.

రెండు సార్లు తనకు కరోనా సోకిందని అయితే ఆ చీకటి గదిలోనే ఉంచారు తప్ప హాస్పిటల్‌కు మాత్రం తీసుకెళ్లలేదని వెల్లడించారు. ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇవ్వలేదని, తరచూ స్పృహ తప్పి పడిపోయేవాడని గుర్తు చేసుకుని బాధపడ్డారు ప్రొఫెసర్ సాయిబాబా. 2014 చివర దశ ఎన్నికల సమయంలో తనను కిడ్నాప్ చేసి ఆపై జైలుకు తరలించిన విషయాలను గుర్తుకు చేశారు సాయిబాబా.తన లాంటి ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా అరెస్టు చేసి దశాబ్దకాలం పాటు హింసిండాన్ని తప్పుబట్టిన సాయిబాబా.. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తన తల్లి మరణిస్తే ఆమె అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని ఆవేదన చెందారు.

ఉగ్రవాదిగా..ప్రమాదపు శక్తిగా ముద్ర

ప్రస్తుతం మనం సంక్షోభంలో ఉన్నామని చెప్పిన సాయిబాబా... కొందరు తమ హక్కుల కోసం జీవనం కోసం పోరాడుతూ ముందుకెళుతుండగా.. కొన్ని శక్తులు మాత్రం కొన్ని వర్గాలు మాత్రమే బాగుపడాలి అనే వాంఛతో పనిచేస్తున్నాయని అన్నారు. దీంతో సహజంగానే ఈ రెండు వర్గాల మధ్య విబేధాలు రావడం, గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటం చేస్తున్న వారిని టార్గెట్ చేసుకుని జైళ్లకు పంపుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే తాను పదేళ్లు ఆ చీకటి గదిలో చిత్రహింసలకు గురైనట్లు గుర్తుచేసుకున్నారు ప్రొఫెసర్ సాయిబాబా.తనను ఉగ్రవాదిగా, ప్రమాద శక్తిగా ఎందుకు ముద్ర వేశారో ఆలోచించాల్సిన సమయం వచ్చిందని సాయిబాబా కోరారు. ఇన్ని విధాలుగా హింసించినప్పటికీ ప్రజలకు ప్రజల హక్కుల కొరకు పోరాడాలనే తన బలమైన సంకల్పమే ఇంతకాలం తనను బతికించిందని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, వాస్తవాలు మాట్లాడితే అలాంటి వారికి ఈ నరకం తప్పదని చెప్పిన సాయిబాబా, ఇప్పుడు మేల్కొనక పోతే సమాజం చాలా నష్టపోతుందని అన్నారు.ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కుల పరిరక్షణ కోసం, వనరుల కోసం, అవకాశాల కోసం పోరాడకుంటే చాలా నష్టపోతామని చెప్పారు. ప్రజా ఉద్యమాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని సాయిబాబా అభిప్రాయపడ్డారు.ఆదివాసీలు గిరిజనుల హక్కుల గురించి రాజ్యాంగంలోని ఐదు ఆరవ షెడ్యూల్ చాలా స్పష్టంగా చెబుతోందని వివరించిన సాయిబాబా... ప్రభుత్వం ఏజెన్సీ ఏరియా హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బయటి వ్యక్తులు వచ్చి గిరిజనులకు చెందిన సహజ వనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించడం నేరమని తెలిపారు.

వాస్తవానికి ఐదు నెలల క్రితమే ప్రొఫెసర్ సాయిబాబా విడుదలైనప్పటికీ ఆయన పలు ఆరోగ్య సమస్యలకు చికిత్సను జైలులోనే ఉండి తీసుకున్నారు. ఆయన ఎడమ చేతి దాదాపుగా పనిచేయడం ఆగిపోయింది.కిడ్నీ సమస్యలు వేధించాయి. గుండె సంబంధిత వ్యాధులతో కూడా సాయిబాబా బాధపడుతున్నారు. 56 ఏళ్ల సాయిబాబా జీవితంలో పదేళ్లు జైలులోనే గడవగా... తాను పనిచేసిన ఢిల్లీ యూనివర్శిటీ తిరిగి తనకు ప్రొఫెసర్‌గా అవకాశం ఇస్తుందేమో అన్న ఆశతో ప్రొఫెసర్ సాయిబాబా ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+