మంత్రి మల్లారెడ్డికి షాక్.. ప్రచారంలో నిరసన సెగ!!
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి వస్తున్న మంత్రి మల్లారెడ్డికి వరుసగా నిరసన సెగలు తగులుతున్నాయి. గ్రామాలలో తిష్ట వేసిన సమస్యలు, అసంపూర్తి పెండింగ్ పనులు కారణంగా ప్రచారంలో మంత్రి మల్లారెడ్డికి ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. నిత్యం తన మాటలు, చేతలతో అందరి దృష్టినీ ఆకర్షించే మంత్రి మల్లారెడ్డికి తన నియోజక వర్గంలోనే నిరసనలు రావడంతో ఆయన కొంత అసహనానికి గురవుతున్నారు.
తాజాగా ఆయనకు మేడ్చల్ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం అయోధ్య నగర్ కాలనీ వాసుల నుంచి నిరసన ఎదురయ్యింది. అయోధ్య నగర్ కాలనీ సమీపంలో ఉన్న డ్రైనేజీ నిర్మాణం జరగక పోవడం వల్ల ఆ మురుగునీరంతా చింతలకుంట చెరువులోకి వదులుతుండటంతో... ఆనీరు తమ కాలనీ లోకి వచ్చి దుర్గంధం వ్యాపిస్తోందనీ ఆందోళన చేపట్టారు.

మంత్రి మల్లారెడ్డి తన ప్రచారంలో భాగంగా మేడిపల్లి మండలం అయోధ్య నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు ఆయనకు అడ్డు తగిలారు. స్థానిక చింతలకుంట చెరువులోకి వదిలిన డ్రైనేజీ నీరు, మురుగు నీటి వ్యర్ధాలు అయోధ్య నగర్ కాలనీలోకి వస్తోందని స్థానికులు ఆయన్ను అడ్డుకున్నారు. డ్రైనేజీ నీరు తమ కాలనీలోకి రావడం వల్ల దోమలు, విష పురుగులు రావడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు.
గతంలో కూడా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ స్పందించక పోవడంతో మురుగు నీటి వ్యర్ధాలు నడుమనే తాము గడుపుతున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. తమ సమస్య పరిష్కరించకుండా ఓటు వేసేది లేదనీ మంత్రికి ఆల్టిమేటం జారీ చేశారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని ఆందోళన నిర్వహించారు.
అయితే ఈ విషయంలో మంత్రి మల్లారెడ్డి స్థానికులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కాలనీ వాసులు వినకుండా మంత్రికి అడ్డుతగిలారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల పనులు ఆగిపోయాయనీ, కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించి త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన ఇచ్చిన హామీతో స్థానికులు సంతృప్తి చెందలేదు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమ సమస్య పరిష్కరించాలని అయోధ్య నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications