పీఎం మోడీకి నిరసన సెగ: సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా; రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వేళ బీఆర్ఎస్ నిరసనలకు శ్రీకారం చుట్టింది. సింగరేణిలోని బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా విక్రయించాలని కేంద్రం నిర్ణయించడంపై మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల వ్యాప్తంగా మహా ధర్నా నిర్వహిస్తున్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక వర్గాలు మండిపడుతున్నాయి.
రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెంలో బొగ్గు గనుల కార్మికులు కేంద్ర ప్రభుత్వ తీర్పు వ్యతిరేకంగా కదం తొక్కి ఆందోళన బాట పట్టారు. శ్రీరాంపూర్ ఏరియా లోని అన్ని భూగర్భ గనులు, అన్ని ఓపెన్ కాస్ట్ గనులలోనూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాలను, బీఆర్ఎస్ చేపట్టిన ఈ మహా ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు.

సింగరేణి బొగ్గు గనులు ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించనున్న మహాధర్నాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు. అలాగే కొత్తగూడెం బొగ్గు గనులలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వరరావు పాల్గొననున్నారు. పెద్దపల్లి జిల్లాలోని బొగ్గు గనుల వద్ద నిర్వహించే మహా ధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకొండ చందర్ తో పాటు బొగ్గు గని కారిక సంఘం నేతలు కూడా పాల్గొననున్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పరివార్వాది పార్టీ బిజెపి అని, అలాగే దేశవ్యాప్తంగా బిజెపి సాధించిన విజయాలు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. భయపడటం అవసరమా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలతో రావణాసురుడు బొమ్మని ఏర్పాటుచేసి కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడి, సిబిఐ, ఐటీలను ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ భయపెట్టడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నారని బిజెపి హమ్లా మోర్చా పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications