నాన్నా! నరకం చూపిన వాడ్ని వదలొద్దు: సూసైడ్ నోట్‌లో ర్యాగింగ్‌కు బలైన వెంకటకృష్ణ
హైదరాబాద్: సీనియర్ విద్యార్థుల వేధింపులకు బలైన ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కేసులో మరో తెలుగు విద్యార్థే కీలక నిందితుడిగా తేలింది. చెన్నైలోని సత్యభామ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వెంకట కృష్ణచైతన్య(19) గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో పోలీసులు చైతన్య రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీనియర్ విద్యార్థి తనను ఎంతలా వేధించాడో చైతన్య తన సూసైడ్ నోట్‌లో వివరించాడు. అదే కళాశాలలో తృతీయ సంవత్సర విద్యార్థి చంద్రశేఖర్.. రెండో సంవత్సరం చదివే సూర్యతో కలిసి తనపై వేధింపులకు పాల్పడినట్లు అందులో పేర్కొన్నాడు.
చంద్రశేఖర్ తనకు నిత్యం నరకం చూపించేవాడని కృష్ణచైతన్య ఆత్మహత్య లేఖలో వాపోయాడు. ‘చంద్రశేఖర్ అందరి ముందూ నాపై చేయిచేసుకునేవాడు, అమ్మ కొనిచ్చిన ఐఫోన్‌తో పాటు, ఏటీఏం కార్డు లాక్కునేవాడు. అతని మొబైల్ బిల్లును కట్టించుకునేవాడు. నాకు సోదరి వరసైన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా మాట్లాడేవాడు' అని తన సూసైడ్ నోట్‌లో వెంకటకృష్ణ పేర్కొన్నాడు.

‘శేఖర్‌తోపాటు మరికొందరు సీనియర్లు ర్యాగింగ్ చేసేవారు. నరకం చూపించారు. అన్‌లైన్ ద్వారా రూ.15వేలు సంపాదించుకుని, వ్యక్తిగత అవసరాల నిమిత్తం అద్దెకారు సమకూర్చుకుంటే.. దాన్ని బలవంతంగా లాక్కొని వారే తిరిగేవారు. వారి హింసను భరించలేకపోతున్నా. నన్ను క్షమించండి. అమ్మ, నాన్న.. మీరంటే నాకెంతో ఇష్టం. మీలాంటి తల్లిదండ్రులు దొరకడం నా అదృష్టం. దాన్ని ఎక్కువకాలం నిలుపుకోలేకపోయాను' అని ఆవేదన చెందాడు.
‘శేఖర్‌ను మాత్రం వదలకండి ప్లీజ్. వాడి మూలంగా ఇకపై నాలాంటి వాళ్లు బలికాకుండా చూడాలి' అంటూ వెంకటకృష్ణ తన తండ్రిని వేడుకున్నాడు. అవసరార్థులకు తన అవయవాలను దానం చేయమంటూ సూసైడ్ నోట్‌లో కృష్ణచైతన్య పేర్కొనడం గమనార్హం. ఎప్పుడూ తన తల్లిదండ్రులు నవ్వుతూ బతకాలని, వారితోనే తాను ఉంటానంటూ పేర్కొన్నాడు. కాగా, వెంకటృష్ణను తలచుకుంటూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications